Omicron: 89 దేశాల్లో ఒమిక్రాన్‌ అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది.

Updated : 19 Dec 2021 10:34 IST

దిల్లీ/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఈ వేరియంట్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరిన ప్రాంతాల్లో 1.5 నుంచి 3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నట్లు వెల్లడించింది. ఆగ్నేయాసియా ప్రాంత పరిధిలోని 7 దేశాల్లో ఒమిక్రాన్‌ బయటపడిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ శనివారం అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్‌ కట్టడికి గాను ప్రజారోగ్య, సామాజిక చర్యలను మరింత ముమ్మరం చేయడం అత్యవసరమని స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముప్పు అధికంగా ఉన్నవారిని కాపాడే విషయమై కీలకంగా దృష్టి సారించాలని సూచించారు. దక్షిణాఫ్రికా నుంచి అందుతున్న డేటా ప్రకారం ఒమిక్రాన్‌తో రీ-ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరుగుతున్నట్లు తెలుస్తోందని, అయితే ఈ వేరియంట్‌పై ఇప్పటికీ డేటా పరిమితంగానే ఉందని పేర్కొన్నారు. రానున్న వారాల్లో మరింత సమాచారం అందే అవకాశం ఉందని ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. కేసుల సంఖ్య పెరిగి వైద్య వ్యవస్థలు మరోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగినంతగా ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ లభ్యత, వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని.. అన్నిస్థాయిల్లోనూ పరిస్థితిని సమీక్షిస్తుండాలని సూచించారు. మహమ్మారితో పోరులో టీకా అతి ముఖ్యమైన అస్త్రమని.. అయితే వ్యాక్సినేషన్‌తో పాటు అన్ని ప్రజారోగ్య చర్యలు చేపట్టడమూ కీలకమేనని తెలిపారు. ‘‘మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ.. ఇతరులనూ కాపాడాలి. ఇందుకు గాను తప్పక టీకా తీసుకోవాలి. మాస్కు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టీకాలు తీసుకున్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ పాటించాలి’’ అని ఆమె సూచించారు.

24 గంటల్లో 7,145 కేసులు

మన దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య శనివారం కొంతమేర తగ్గింది. గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు) 7,145 కొత్త కేసులు బయటపడగా.. 289 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు తగ్గాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కి చేరగా.. ఇంతవరకు 4,77,158 మందిని మహమ్మారి బలిగొంది. 3,41,71,471 మంది కొవిడ్‌ను జయించారు. క్రియాశీలక కేసుల సంఖ్య 84,565 (0.24%)కి తగ్గింది. దేశవ్యాప్తంగా శుక్రవారం 12,45,402 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.57 శాతం నమోదైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని