Rajnath Singh:భారత్‌లోనే ఆయుధాల తయారీ

భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలను, సైనిక పరికరాలను తమ గడ్డపైనే తయారుచేయాలని

Updated : 19 Dec 2021 11:03 IST

దేశంలోనే చేపట్టాలని అమెరికా, రష్యాలకు స్పష్టం చేశాం 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ వెల్లడి

దిల్లీ: భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలను, సైనిక పరికరాలను తమ గడ్డపైనే తయారుచేయాలని అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌ తదితర భాగస్వామ్య దేశాలకు స్పష్టం చేసినట్టు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం వెల్లడించారు. విభజన కారణంగా పుట్టిన దేశం భారత పురోగతిని చూసి శాశ్వతంగా ఆందోళన చెందుతోందని, మరో దేశం నిత్యం కొత్త ప్రణాళికలను రూపొందించుకోవడంలో నిమగ్నమైందంటూ పాకిస్థాన్, చైనాలను ఆయన దెప్పి పొడిచారు. ఈ మేరకు భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరిపైనో దాడి చేయాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదనీ... శత్రువుల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా సాయుధ బలగాలను సన్నద్ధం చేయాలన్నదే తమ అభిమతమని చెప్పారు. 

జాతీయ భద్రతకే పెద్దపీట 

జాతీయ భద్రతే తమ తొలి ప్రాధాన్యమని, అందుకే భారత్‌కు అవసరమైన ఆయుధాలను దేశీయంగానే తయారు చేయాలని మిత్ర దేశాలను కోరినట్టు రాజ్‌నాథ్‌ చెప్పారు. ‘‘భారత్‌కు వచ్చి తయారు చేయండి. భారత్‌ కోసం, ప్రపంచం కోసం ఇక్కడే తయారు చేయండి’’ అని భాగస్వామ్య దేశాలకు చెప్పామని, ఇందుకు మంచి స్పందన లభిస్తోందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. భారత ఆయుధ సంపత్తి, రక్షణ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్న తీరును ఆయన వివరించారు. 

భారత్‌ ఆయుధ వ్యవస్థల కోసం ఫ్రాన్స్‌ ఇంజిన్లు 

భారత్, ఫ్రాన్స్‌ మధ్య రక్షణ రంగంలో మైత్రి కొత్త పుంతలు తొక్కుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన అగ్రశ్రేణి ఇంజిన్‌ తయారీ సంస్థ భారత్‌లో ఆయుధ వ్యవస్థలకు ఇంజిన్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద మన దేశానికి చెందిన ఒక కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్‌ రక్షణ మంత్రితో శుక్రవారం తాను జరిపిన చర్చల్లో దీనిపై అవగాహన కుదిరినట్లు చెప్పారు. అది ఏ తరహా ఇంజిన్‌ అన్నదానిపై రాజ్‌నాథ్‌ స్పష్టత ఇవ్వలేదు. అయితే అది సైనిక హెలికాప్టర్లకు ఉద్దేశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ యుద్ధవిమానం ‘తేజస్‌’ కోసం కావేరి పేరిట ఇంజిన్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్‌ ఇప్పటికే రూ.2,305 కోట్లు వెచ్చించింది. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

శిక్షణ విభాగం ప్రారంభం 

మరోవైపు ప్రభుత్వ అధికారులకు డ్రోన్, ఉపగ్రహ చిత్రాల ఆధారిత సర్వేల్లో శిక్షణ ఇచ్చేందుకు ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సెలెన్స్‌ ఇన్‌ ల్యాండ్‌ సర్వే’ను రాజ్‌నాథ్‌ ప్రారంభించారు. దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఈఎం)లో దీన్ని ఏర్పాటు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని