Omicron: ఉద్ధృతంగా డెల్టా.. భయపెడుతున్న ఒమిక్రాన్‌

అమెరికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పలుచోట్ల బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వైద్యులు, నర్సులు, 

Published : 20 Dec 2021 08:55 IST

అమెరికాలో కొవిడ్‌ విజృంభణ
వారంలో 8 వేలకు పైగా మరణాలు

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పలుచోట్ల బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నిర్విరామంగా శ్రమించాల్సి వస్తోంది. అక్కడ ఇప్పటికే కరోనా డెల్టా రకం ఉద్ధృతి తీవ్రంగా ఉండగా.. అత్యధిక సంక్రమణ శక్తితో వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయపెడుతోంది. అమెరికాలో గత వారం రోజుల్లో 8.5 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు వారంలోనూ 8.25 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా.. 8,500 మందికి పైగా మృతి చెందారు. గత 7 రోజుల్లో సగటున 60 వేల మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరారు. ఇది నవంబరు ప్రారంభం నాటి కంటే 50% ఎక్కువని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌లో శనివారం దాదాపు 20 వేల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఒహివోలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నెబ్రెస్కాలో ఆసుపత్రులకు కొవిడ్‌ రోగుల తాకిడి పెరుగుతుండటంతో ఇతర వ్యాధులతో వస్తున్న వారందరినీ చేర్చుకోలేని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాన్సాస్, మిస్సోరీల్లో శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నారు. 

61% వ్యాక్సినేషన్‌..

అమెరికాలో అర్హులైన 61% జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే టీకా పొందనివారే అధికంగా కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ తీవ్రంగా విజృంభించే అవకాశాలున్నాయని.. అదే జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కోవడం కష్టమేనని చెబుతున్నారు. డెట్రాయిట్‌లో ఆసుపత్రుల పాలైన కొవిడ్‌ రోగుల్లో 80% మంది టీకా పొందని వారేనని స్థానిక వైద్యులు తెలిపారు.

వాషింగ్టన్‌ స్టేట్‌ సెనేటర్‌ మృతి..
నెల రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడిన వాషింగ్టన్‌ స్టేట్‌ సెనేటర్‌ డగ్లస్‌ ఎరిక్సన్‌ (52) శుక్రవారం మృతి చెందారు. ఎరిక్సన్‌ చనిపోయినట్లు ఆయన కుటుంబం ప్రకటించింది. అయితే ఆయన మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు