
Parliament: ప్రధాన ఇంధన వనరు బొగ్గే
ఈనాడు, దిల్లీ: పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ దేశ ప్రధాన ఇంధన వనరుగా బొగ్గే కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇంధన భద్రతకు, థర్మల్ విద్యుదుత్పత్తికి తగినంత బొగ్గు నిల్వలు మనకు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా అందుబాటు ధరల్లోనూ లభిస్తుందని పేర్కొన్నారు. బొగ్గు వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తామంటూ కాప్26 సదస్సులో భారత ప్రభుత్వం హామీ ఇవ్వడంపై సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించలేదన్నారు.
రెండో విడత అనుబంధ పద్దులకు లోక్‌సభ ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా మరో రూ.3.73లక్షల కోట్ల వ్యయ అనుమతులకు సంబంధించి రెండో విడత అనుబంధ పద్దును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ మొత్తంలో ఎయిర్ ఇండియాకు అందజేసే నిధులు రూ.62వేల కోట్లు, ఎరువులపై అదనపు రాయితీ రూ.58,430 కోట్లు, పెండింగ్‌లో ఉన్న ఎగుమతుల ప్రోత్సాహకాల చెల్లింపులకు రూ.53,123కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ నిధి కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు అందజేసే రూ.22,039 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన తొలి విడత అనుబంధ పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం రూ.23,675 కోట్లను అదనంగా ఖర్చు చేసేందుకు పార్లమెంటు ఆమోదాన్ని పొందింది.
కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 122 మంది విద్యార్థుల ఆత్మహత్య
కేంద్ర విద్యా సంస్థల్లో 2014-2021 మధ్య కాలంలో 122 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇందులో సెంట్రల్ యూనివర్శిటీల్లో 27 మంది, ఐఐటీల్లో 34, ఎన్‌ఐటీల్లో 30, ఐఐఎస్‌ఈఆర్‌లో 9, ట్రిపుల్‌ఐటీల్లో నలుగురు, ఇతర కేంద్ర సంస్థల్లో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 41 మంది ఓబీసీ, 24 మంది ఎస్సీ, ముగ్గురు ఎస్టీ, ముగ్గురు మైనార్టీ విద్యార్థులున్నట్లు తెలిపారు. కేంద్ర విద్యా సంస్థల్లో విద్యార్థులు వేధింపులు, వివక్షకు గురికాకుండా కేంద్ర ప్రభుత్వం, యూజీసీ పలు చర్యలు తీసుకొందని చెప్పారు.
పాఠశాలల్లో భగవద్గీత బోధనను రాష్ట్రాలు అనుమతించుకోవచ్చు
పాఠాశాలల్లో భగవద్గీత బోధనకు సంబంధించిన అనుమతులను రాష్ట్రాలు మంజూరు చేసుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి లోక్‌సభకు తెలిపారు. అది ఆయా రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అలాగే భోజ్‌పురి భాష బోధనపై కూడా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. సీబీఎస్‌ఈ పాఠశాలల్లోని వివిధ తరగతుల్లో భగవద్గీత బోధన జరుగుతోందన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
మాదక ద్రవ్యాల నియంత్రణ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని కొన్ని స్వల్ప పొరపాట్లను సరిచేయడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఎన్‌డీపీఎస్ సవరణ బిల్లు తొలుత ఈ నెల 13న లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును సోమవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో సమ్మతించింది.
సభ నడవాలని విపక్షం కోరుకోవట్లేదు: భాజపా
అంతరాయాలు కలిగించి అడ్డుకోవడమే విపక్షాల మంత్రంగా ఉందని, సభలు నడవాలని అవి కోరుకోవట్లేదని భాజపా విమర్శించింది. 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై నెలకొన్న ప్రతిష్టంభన మీద చర్చించడానికి ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన సమావేశానికి ఐదు పార్టీలు హాజరుకాకపోవడాన్ని తప్పుపట్టింది. రాజ్య సభాపక్ష నేత పీయూష్ గోయల్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- అవాంతరాలు తప్పిస్తే విపక్షాలకు మరేమీ అవసరం లేదన్నారు. ఉభయ పక్షాలూ సమావేశమై ఒక పరిష్కారానికి రావాలని భావిస్తున్న రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఇచ్చిన ఆదేశాలతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2010లో ఏడుగురు విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేస్తే ఆ తర్వాత ఆనాటి విపక్ష నేతగా అరుణ్‌జైట్లీ క్షమాపణలు కోరిన మీదటే ఆ చర్యను ఉపసంహరించుకున్నారని గుర్తుచేశారు. సస్పెండైనవారిలో భాజపా ఎంపీలెవరూ లేకపోయినా విపక్ష నేతగా జైట్లీ అలా స్పందించారని చెప్పారు. పార్లమెంటుతో పాటు సభాధ్యక్షుని గౌరవాన్ని కాపాడడానికి ఇప్పుడు 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పాలని గోయల్ అన్నారు. గత ఆరు దశాబ్దాలుగా ఇలాంటిది ఆనవాయితీగా వస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.
పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు రెండు బిల్లులు
చట్టాల తయారీ ప్రక్రియలో తగిన విధంగా సంప్రదింపులు జరపలేదన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో రెండు బిల్లులను పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. జీవ వైవిధ్య(సవరణ) బిల్లును సంయుక్త కమిటీకి, మధ్యవర్తిత్వ బిల్లును స్థాయీ సంఘం(లా అండ్ జస్టిస్)కి సిఫార్సు చేసింది. జీవ వైవిధ్య(సవరణ)బిల్లును సంయుక్త కమిటీ పరిశీలనకు పంపించాలన్న తీర్మానాన్ని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సంయుక్త కమిటీలో 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ(శాస్త్రసాంకేతికత, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు) పరిశీలనకు కాకుండా సంయుక్త కమిటీకి పంపించడంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేశ్ అభ్యంతరం తెలుపుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వివాదాస్పదమైన జీవ వైవిధ్య (సవరణ) బిల్లును సంయుక్త కమిటీకి పంపించడంలో ప్రభుత్వ ఉద్దేశాలు ఏమిటో స్పష్టమవుతున్నాయని ఆక్షేపించారు. స్టాండింగ్ కమిటీ(శాస్త్రసాంకేతికత, పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పులు)కి జైరామ్ రమేశ్ ఛైర్మన్‌గా ఉన్నారు.
* మధ్యవర్తిత్వ బిల్లు-2021ను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్టాండింగ్ కమిటీ (లా అండ్ జస్టిస్) పరిశీలనకు ప్రతిపాదించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.