ఏంజెలీనాకు నువ్వేం తక్కువ..జాక్వెలిన్‌ను ఊరించి ముగ్గులోకి దింపిన సుకేశ్‌

ఎరక్కపోయి హవాలా కేసులో ఇరుక్కుని ఈడీ విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సంబంధించి

Updated : 21 Dec 2021 10:26 IST

దిల్లీ: ఎరక్కపోయి హవాలా కేసులో ఇరుక్కుని ఈడీ విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆమెతో స్నేహం పెంచుకోవడానికి, తనను పూర్తిగా నమ్మేలా చేయడానికి ప్రదర్శించిన మాయలు నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. విలాసవంతమైన కారు, గుర్రంలాంటి రూ.కోట్ల విలువైన బహుమతులను  ఇవ్వడంతోపాటు, కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులతో తనకు సన్నిహిత పరిచయాలున్నాయని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అంతేకాదు.. జాక్వెలిన్‌ను బురిడీ కొట్టించడానికి ఆమెతో ఏకంగా రూ.500 కోట్లతో మూడు భాగాలతో ఉండే సినిమాను నిర్మిస్తానని మాటిచ్చాడట. సూపర్‌ హీరో కథలతో హాలీవుడ్‌ గ్రాఫిక్స్‌ నిపుణులతో ఆ సినిమాను నిర్మిస్తానని, భారత్‌లో ఇదే తొలి నాయికా ప్రాధాన్య సూపర్‌హీరో సినిమా అవుతుందని బీరాలు పలికాడట. నువ్వు అచ్చం హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీలా ఉంటావని, ఆమెకన్నా నువ్వేం తక్కువ కాదని కోతలు కోసి జాక్వెలిన్‌కు ఊహల్లోనే 70ఎంఎం సినిమా చూపించాడట. బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేని జాక్వెలిన్‌ను ముగ్గులోకి దించడానికి ఈ కథలు అల్లాడని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబయి నుంచి చెన్నైకు వెళ్లేందుకు జాక్వెలిన్‌కు సుకేశ్‌ చార్టర్డ్‌ విమానాన్ని ఏర్పాటు చేశాడని వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని