OBC Reservation:ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27% సీట్లను కేటాయిస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది.

Published : 22 Dec 2021 10:46 IST

సమీక్ష పిటిషన్‌ వేసేందుకు కేంద్రం మొగ్గు

దిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27% సీట్లను కేటాయిస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు జారీచేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. అయితే- ఇందుకు గీటురాళ్ల వంటి మూడు పరీక్షలు చేపట్టాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పూర్తిచేసేంత వరకూ... స్థానిక సంస్థలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఓబీసీ రిజర్వేషన్లను అనుమతించాలని కోరుతూ సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. రాజకీయ రిజర్వేషన్లంటే పార్లమెంటు, విధాన సభలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఓబీసీలకు సీట్లు కేటాయించడం. ఇందుకు సుప్రీంకోర్టు మూడు పరీక్షలను నిర్దేశించింది.

1) ఒక రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబాటుతనాన్ని నిగ్గుతేల్చడానికి ప్రత్యేక విచారణ కమిషన్‌ను నియమించాలి.

2) సదరు కమిషన్‌ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి.

3) షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఓబీసీలకు కేటాయించే సీట్లు 50 శాతానికి మించకుండా చూడాలి. కాగా- ఓబీసీలకు కేటాయించిన 27% సీట్లను జనరల్‌ తరగతి పరిధిలోకి తెచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని మహారాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ ఎన్నికల సంఘం కూడా ఓబీసీ సీట్ల రిజర్వేషన్లను నిలిపివేసి, ఆ సీట్లను జనరల్‌ తరగతి కిందకు తీసుకురావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని, ఈ సమస్యపై కేంద్రం సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయాలనుకుంటోందని కేంద్ర సామాజిక న్యాయశాఖ ప్రకటించింది. ఓబీసీలకు రిజర్వేషన్లు నిరాకరించడమంటే, మధ్యప్రదేశ్‌లోని 70% జనాభాకు అన్యాయం చేయడమేనని భాజపా నాయకురాలు ఉమాభారతి వ్యాఖ్యానించారు. సమస్యకు పరిష్కారం కనుగొనాలని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను ఆమె కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు