
Omicron: ఒమిక్రాన్.. మరో తుపాను!
ఐరోపాలో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
వియన్నా: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ‘మరో తుపాను’గా పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఐరోపా దేశాలను మంగళవారం హెచ్చరించింది. కేసులు అమాంతం పెరిగే అవకాశం ఉన్నందున సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించింది. ఈమేరకు డబ్ల్యూహెచ్‌ఓ ఐరోపా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లుజ్ వియన్నాలో విలేకరులతో మాట్లాడారు. కొద్ది వారాల్లోనే అనేక దేశాల్లో ఒమిక్రాన్ అన్ని ఇతర రకాలను మించిపోయి, వైద్య వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెంచే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరికలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌ఓ ఐరోపా రీజన్‌లో ఉన్న 53 దేశాలకు గాను 38 చోట్ల ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు చెప్పారు. బ్రిటన్, డెన్మార్క్, పోర్చుగల్ దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్ తతీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. ఐరోపాలో 89% ఒమిక్రాన్ కేసుల్లో ఇతర వేరియంట్ల మాదిరిగానే.. దగ్గు, గొంతులో మంట, జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో 20లు, 30ల్లో ఉన్న వారిద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.