Published : 24 Dec 2021 10:58 IST

Joe Biden:కొవిడ్‌ మాత్ర కీలక ముందడుగు: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా బుధవారం ఆమోదించిన తొలి కొవిడ్‌-19 మాత్ర ఈ మహమ్మారితో మనం చేస్తున్న పోరాటంలో కీలక ముందడుగంటూ అధ్యక్షుడు జో బైడెన్‌ అభినందించారు. వైరస్‌ లక్షణాల నుంచి రక్షణకు ఇంటి పట్టునే ఉండి తీసుకునేందుకు వీలుగా ‘పాక్స్‌లోవిడ్‌’ మాత్రను ఫైజర్‌ కంపెనీ రూపొందించింది. పంపిణీలో అసమానతలు లేకుండా చూస్తామని బైడెన్‌ చెప్పారు. 

కొవిడ్‌ నివారణకు మరో మాత్ర ‘మెర్క్‌’ 

ఒమిక్రాన్‌ విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌-19 మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో భాగంగా అమెరికా గురువారం మరో కొవిడ్‌ మాత్ర ‘మెర్క్‌’కు ఆమోదం తెలిపింది. ఫైజర్‌ కంపెనీ రూపొందించిన ‘పాక్స్‌లోవిడ్‌’ మాత్రకు పచ్చజెండా ఊపిన మరుసటిరోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అయితే, మొదటి ప్రాధాన్యం మాత్రం ఫైజర్‌ మాత్రకే ఉంటుందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. గత నవంబరు నెలలోనే ‘మెర్క్‌’ మాత్రకు బ్రిటన్‌ ఆమోదం తెలుపగా.. తాజాగా ఆమోదించిన అమెరికా వృద్ధుల చికిత్సకు ఈ మాత్రను సిఫార్సు చేసే అవకాశముంది. 

ఐరాస జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడికి పాజిటివ్‌

ఐరాస: ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు, మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా షాహిద్‌(59)కు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ఇంట్లోనే ఐసొలేషనులో ఉంటున్నట్లు గురువారం తనే స్వయంగా ప్రకటించారు. అబ్దుల్లా షాహిద్‌ బూస్టర్‌ డోసు కూడా తీసుకొన్నారు. 

ఆస్ట్రేలియాలో ఉన్నపళంగా పెరిగిన కేసులు

సిడ్నీ: ఒమిక్రాన్‌ విస్తరణ తగ్గించేందుకు లాక్‌డౌన్ల విధింపు, మాస్కుల తప్పనిసరి నిబంధనల అమలుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ నిరాకరించిన మరుసటిరోజే కేసులు ఆ దేశంలో ఉన్నపళంగా పెరిగాయి. జన సమ్మర్దం ఎక్కువగా గల న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 5,715 కరోనా కేసులు నమోదయ్యాయి. 

దక్షిణ కొరియాలో..

సియోల్‌: దక్షిణ కొరియాలో గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయి కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 109 మంది ఈ మహమ్మారికి బలి కాగా, 6,919 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 12 ఒమిక్రాన్‌ కేసులతో దేశంలో ఈ కొత్త వేరియంట్‌ బాధితుల సంఖ్య 246కు చేరింది.

కొవావ్యాక్స్‌పై మరింత సమాచారం కోరిన డీసీజీఐ

దిల్లీ: కొవావ్యాక్స్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతివ్వాలంటే మరింత సమాచారంతో పాటు మరికొన్ని వివరణలను అందించాల్సి ఉంటుందని సీరమ్‌ సంస్థకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ తెలిపింది. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్‌తో చేసుకున్న సాంకేతిక బదిలీ ఒప్పందం ప్రకారం ఆ సంస్థ టీకా కొవావ్యాక్స్‌ను సీరం సంస్థ మన దేశంలో అభివృద్ధి చేస్తోంది. అత్యవసర వినియోగం నిమిత్తం విపణిలోకి తీసుకొచ్చేందుకు ఈ టీకాకు అనుమతినివ్వాలని అక్టోబరులో డీసీజీఐకి సీరం సంస్థ దరఖాస్తు చేసుకుంది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణులు నవంబరు 27న సమావేశమై సీరం సంస్థ దరఖాస్తును పరిశీలించి మరింత సమాచారం కావాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం కొవావ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేసిన విషయం విదితమే. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని