
Exam:సైఫ్-కరీనా కుమారుడి పేరేంటి?
ఆరో తరగతి పరీక్షలో జనరల్ నాలెడ్జి విభాగ ప్రశ్న
ప్రైవేటు పాఠశాలకు తాఖీదు పంపిన అధికారులు
ఖండవా: సినీ నటులు కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ తనయుడి పూర్తి పేరేమిటి? ఈ ప్రశ్న ఇప్పుడెందుకు అంటారా? ఎందుకంటే ఇది ఆరో తరగతి విద్యార్థుల ప్రశ్నాపత్రంలో అడిగారు మరి! మధ్యప్రదేశ్‌లోని ఖండవాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జనరల్ నాలెడ్జ్ పరీక్షలో భాగంగా సినిమా తారల గురించి అడిగారు. ఈ ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయ సంఘాలతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం, దేశభక్తికి సంబంధించిన ప్రశ్నలు అడగకుండా.. సినిమా గురించి అడగటం ఏంటని నిలదీస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన జిల్లా విద్యాధికారి ఎస్.కె.భలేరావ్..పాఠశాల యాజమాన్యానికి నోటీసులు పంపించినట్లు తెలిపారు. ప్రశ్న పత్రాలు రూపొందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
నెటిజన్ల సెటైర్లు
మరోవైపు, దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. సైఫ్-కరీనాకు ఇద్దరు తనయులని, వారిలో ఎవరి పేరు రాయాలో స్పష్టంగా చెప్పలేదని ఛలోక్తులు విసురుతున్నారు. 2012లో సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్‌ల వివాహం జరిగింది. వీరికి తైమూర్ అలీఖాన్ పటౌడీ, జహంగీర్ అలీఖాన్ పటౌడీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.