కొవిడ్‌ ఆంక్షలతోఎగరని విమానాలు..ప్రపంచ దేశాల్లో కళ తప్పిన క్రిస్మస్‌

పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. 

Updated : 26 Dec 2021 10:30 IST

రోమ్‌: పలు దేశాల్లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు.. విమానాల రద్దు.. మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు వంటి కారణాలతో శనివారం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు కళ తప్పాయి. ఆసియా, ఐరోపా దేశాల్లో పలుచోట్ల ఒమిక్రాన్‌ అణచివేతకు ఆంక్షలు విధించారు. కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న చాలామంది టీకాలు తీసుకోలేదని ఫ్రాన్స్‌లోని మాసే ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ అధిపతి లా టిమోన్‌ తెలిపారు. ఇంగ్లాండులో శనివారం రికార్డు స్థాయిలో 1,22,186 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో వేలాది సంఖ్యలో జనం బూస్టర్‌ డోసు తీసుకొన్నారు.

ఆఫ్రికా ఖండంలో 8.9 శాతం మాత్రమే రెండు డోసులు పూర్తి చేసుకొన్నారు. ప్రపంచంలోకెల్లా అతితక్కువ వ్యాక్సినేషను జరిగిన ఖండం ఇదే. మరోవైపు.. ఆసియాలో అతిపెద్ద రోమన్‌ కేథలిక్‌ దేశమైన ఫిలిప్పీన్స్‌ తుపాను విషాదం నుంచి ఇంకా బయటపడలేదు. ఇప్పటికీ చాలామంది నిరాశ్రయులుగా, విద్యుత్తు, తగినంత ఆహారం, నీరు లేకుండా గడుపుతున్నారు. గత వారం ఫిలిప్పీన్స్‌ను కుదిపేసిన తుపానుకు 375 మంది మృతిచెందారు. దక్షిణ కొరియా చర్చీల్లో హాజరు 70 శాతం మించకూడదని ఆంక్షలు విధించారు. ఆస్ట్రేలియాలోనూ నిబంధనల నడుమ వేడుకలు జరిగాయి. 95 శాతం వ్యాక్సినేషను పూర్తి చేసుకొన్న న్యూజిలాండ్‌ కొద్దిపాటి ఆంక్షలతో ఘనంగా క్రిస్‌మస్‌ వేడుకలు జరుపుకొంది. 92 శాతం వ్యాక్సినేషను పూర్తయిన ఫిజీలోనూ చర్చీల్లో సందడి కనిపించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని