
Covid: కొనసాగుతున్న కొవిడ్ విజృంభణ..ఆంక్షల బాటలో వివిధ దేశాలు
ఫ్రాన్స్‌లో రికార్డుస్థాయి కేసులు
ఆస్ట్రేలియాలో విస్తరిస్తున్న ఒమిక్రాన్
పారిస్/బీజింగ్/లండన్/న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలుచోట్ల కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గత వారం ప్రపంచంలో మొత్తం 51.45 లక్షల కేసులు నమోదు కాగా.. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 13% ఎక్కువ. కొద్ది వారాల్లో బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. చైనాలో ఒక్క రోజులో 206 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇందులో 158 కేసులు షాంగ్జీ, గువాంగ్జీ ప్రావిన్సుల్లో స్థానికంగా వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క కొత్త కేసు రాకూడదన్న (జీరో కేస్ విధానం) లక్ష్యంతో చర్యలు చేపడుతున్న చైనాలో పలుచోట్ల వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కట్టడి చర్యలను సమీక్షించింది. బీజింగ్‌లో స్థానిక వ్యాప్తి ద్వారా కేసులు పెరిగితే మరిన్ని కొత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. డిసెంబరు 13న చైనాలో తొలిసారి ఓ వ్యక్తి ఒమిక్రాన్ బారినపడగా.. తర్వాత కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి.
• ఫ్రాన్స్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క రోజులో లక్షకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల వ్యాప్తితో గత నెల రోజుల్లో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య రెట్టింపైంది. దేశంలో గత వారం రోజుల్లో వెయ్యి మందికి పైగా కరోనాతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సోమవారం అత్యవసర సమావేశాలను నిర్వహించనుంది. కాగా ప్రస్తుత హాలిడే సీజన్ తర్వాత బడులు తెరవడాన్ని ఆలస్యం చేయాలని లేదా తిరిగి కర్ఫ్యూ విధించాలని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచితే సరిపోతుందన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
• బ్రిటన్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వివిధ ప్రాంతాల్లో ఆదివారం నుంచి కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈమేరకు వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టారు. తాజా పరిస్థితిని సమీక్షించడంతో పాటు, నిపుణుల సలహాలను కోరేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గం సోమవారం సమావేశం కావొచ్చని తెలుస్తోంది. కొత్తగా విధించిన ఆంక్షల్లో భాగంగా.. రాత్రి క్లబ్‌లను మూసివేశారు. పబ్‌లు, రెస్టారెంట్లు, సినిమాల్లో ఆరుగురికి మించి గుమిగూడకుండా ఆదేశాలిచ్చారు. ప్రాంగణాల్లోపల, బహిరంగంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేవారి సంఖ్యపై పరిమితులు విధించారు. కనీసం ఒక మీటరు భౌతిక దూరం పాటించాలన్న నిబంధన విధించారు.
• కొవిడ్ సమస్యలతో అధిక సంఖ్యలో సిబ్బంది సెలవుల్లో ఉండటంతో అమెరికాలో శనివారం వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఓవైపు హాలిడే సీజన్ కావడంతో చాలామంది ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోగా.. వారంతా ఇబ్బందులు పడ్డారు. అమెరికాకు వచ్చిపోయే విమానాలు దాదాపు వెయ్యి వరకు రద్దయినట్లు సంబంధిత వెబ్‌సైట్ ఒకటి తెలిపింది. ఆదివారం కూడా 250 వరకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా తాము సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నట్లు పలు విమానయాన సంస్థలు తెలిపాయి.
• ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఒక్కరోజులో 6,394 కొత్త కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలుగా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మరో పెద్ద రాష్ట్రమైన విక్టోరియాలో 1,608 కేసులు బయటపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల్లో 70% వరకు ఒమిక్రాన్ ఉంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా సిడ్నీలోని ఓ ప్రముఖ ల్యాబొరేటరీ దాదాపు 400 మందికి సంబంధించి కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు ఇచ్చింది. వారందరికీ ‘నెగెటివ్’ వచ్చినట్లు చెప్పగా.. వాస్తవంగా వారికి ‘పాజిటివ్’గా తేలింది. దీంతో అనంతరం వారందరినీ సంప్రదిస్తూ వాస్తవ ఫలితాలు చెబుతున్నట్లు సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.