ఆలస్యాన్నే అనుమతిగా భావిస్తాం:గవర్నర్‌కు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం

అనుమతి ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యాన్నే అంగీకారంగా భావించి

Published : 28 Dec 2021 10:57 IST


ముంబయి: అనుమతి ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యాన్నే అంగీకారంగా భావించి మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం గవర్నర్‌ భగవత్‌ సింగ్‌ కోషియారికి తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే స్పీకర్‌ ఎన్నిక జరపాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ ఎన్నిక జరిపితీరాలని నిర్ణయించింది. ఎన్నో విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా స్పీకర్‌ ఎన్నిక నిర్వహణకు ఆయన అనుమతి ఇవ్వకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నిక షెడ్యూలుకు ఆయన అంగీకారం తెలపలేదు. స్పీకర్‌ ఎన్నిక విధానంలో చేసిన కొన్ని మార్పులపై గవర్నర్‌ అభ్యంతరం తెలిపారు. ఈ ఎన్నికను బ్యాలెట్ల ద్వారా కాకుండా మూజువాణి ఓటుతో జరిపేలా ప్రభుత్వం నిబంధనలు సవరించింది. అయితే మూజువాణి ఓటు ద్వారా స్పీకర్‌ ఎన్నిక నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ముఖ్యమంత్రిని ఉద్ధవ్‌ ఠాక్రే ఉద్దేశించి సోమవారం ఉదయం గవర్నర్‌ లేఖ రాశారు. దీనికి సమాధానం అన్నట్టుగా శీతాకాల సమావేశాలకు మంగళవారమే చివరి రోజు కాబట్టి ఎన్నిక జరిపి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని