
Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్..సోమవారం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు!
ఇంటర్నెట్‌డెస్క్: ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 14.4 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. తాజాగా కేసుల దెబ్బకు ఏడు రోజుల సగటు కూడా గణనీయంగా పెరిగింది. ఇది ఈ వారం 8,41,000గా నమోదైంది. ఒక నెల క్రితం నమోదైన కేసులతో పోలిస్తే ఇది 49శాతం ఎక్కువ. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ తొలి సార్స్‌కోవ్-2 కంటే 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. వ్యాక్సిన్ తీసుకొన్న వారిపై ఒమిక్రాన్ ప్రభావం నామమాత్రంగానే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిడ్ మరణాల్లో మాత్రం చెప్పుకోదగ్గ పెరుగుదల లేదని వెల్లడిస్తున్నాయి. మరణాల ఏడు రోజుల సగటు అక్టోబర్ రెండో వారం నుంచి 7వేలుగా ఉంది.
వ్యాక్సినేషన్ల తర్వాత వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటామనే ఆశలపై ఒమిక్రాన్ నీళ్లుచల్లింది. మరోపక్క అమెరికాలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొవిడ్ రోగుల ఐసోలేషన్ సమయాన్ని తగ్గించింది. గతంలో 10 రోజులుగా ఉన్న ఐసోలేషన్ సమయాన్ని 5 రోజులకు కుదించారు. ఒమిక్రాన్ వ్యాప్తి సమయంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.