
పోలింగ్ సిబ్బంది ఫ్రంట్‌లైన్ వర్కర్లే..వారికి ‘ప్రికాషన్ డోసు’ ఇవ్వాలి
శాసనసభ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు
దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల్లో.. పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితాలో చేర్చుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం లేఖలు రాశారు. అర్హులందరికీ సత్వరం టీకాలు అందజేయాలని సూచించారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపుర్ శాసనసభల ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించనుంది.
వృద్ధులకు వైద్యుల సిఫార్సు అక్కర్లేదు..
60 ఏళ్లు దాటి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యుల సిఫార్సు లేకుండానే ప్రికాషన్ డోసు అందించవచ్చని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఇలాంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వైద్యుని సలహా తీసుకుని మూడో డోసు తీసుకోవచ్చంది. జనవరి 10 నుంచి ఆరోగ్య సిబ్బందికి, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్టు తెలిపింది. రెండో డోసు తీసుకున్న 39 వారాల తర్వాత మూడో డోసు ఇస్తారు. కాగా, అర్హులంతా ప్రికాషన్ డోసు తీసుకోవాలని కొవిన్ యంత్రాంగం సమాచారం అందించనుందని రాజేశ్ భూషణ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.