
Omicron: ఇతర వేరియంట్లతో పోలిస్తే‘ముప్పు’ తక్కువ.. వ్యాప్తి ఎక్కువ!
డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
దిల్లీ: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, చాలామంది అనారోగ్యం పాలవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. భారత్‌లో వైద్య సంరక్షణ అవసరాలు ఒక్కసారిగా పెరగడం పెను సవాల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అవుట్-పేషెంట్ విభాగాలపైన, ఇంటివద్ద వైద్య సంరక్షణ కోసం కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. లక్షణాలు లేనప్పటికీ ప్రజలు వైద్యులతోను, ఆరోగ్య సిబ్బందితోనూ సంప్రదించి సలహాలు పొందాలని కోరుకుంటారని.. ఇందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. టెలీ వైద్య సేవలను పెంచాలని చెప్పారు. ఇళ్ల వద్ద లేదా ప్రాథమిక సంరక్షణ ఐసొలేషన్ కేంద్రాల వద్ద సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ఈసారి ఐసీయూలు, ఆసుపత్రి పడకల సేవల కంటే.. అవుట్-పేషెంట్లు, ఇళ్ల వద్ద సేవలు అందించాల్సిన అవసరమే ఎక్కువ ఉండొచ్చని పేర్కొన్నారు. కొత్త వేరియంట్‌ను.. ప్రజలు ఓ సాధారణ జలుబులా భావించి, తేలికగా తీసుకునే అవకాశం ఉందని, ఇదే అసలు సమస్యగా మారుతుందని ఆమె హెచ్చరించారు. ఈ దశలో దీనిపట్ల ఓ నిర్ణయానికి రాగలమని తాను భావించడం లేదన్నారు. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్‌ను స్వల్పమైనదిగా భావించి ఉదాసీనంగా వ్యవహరించడమే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. డెల్టా, ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ ఏ స్థాయిలో ఉంటుందో దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ల నుంచి మనకు చాలా సమాచారం ఉందని పేర్కొన్నారు.
‘‘ఇతర వేరియంట్లు తీవ్రంగా ఉన్నప్పుడు 40,000 కేసులు వస్తే.. ఒమిక్రాన్ అదే స్థాయిలో ఉంటే ఆ సంఖ్య 1,40,000 ఉంటుంది. అయితే ఆసుపత్రుల పాలయ్యే ముప్పు మాత్రం నాలుగో వంతు మాత్రమే ఉంటుంది. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ సాంక్రమిక శక్తి ఉన్నప్పటికీ.. గతంలోని వేరియంట్ల వల్ల ఆసుపత్రుల్లో చేరినంత మందే ఇప్పుడూ ఉండే అవకాశం ఉంది’’ అని ఆమె వివరించారు. అలాగే ఇతర వేరియంట్లతో పోలిస్తే తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పు ఒమిక్రాన్‌తో తక్కువేనని చెప్పారు. అలాగని ఆసుపత్రులు, అవుట్-పేషెంట్ విభాగాలు, వైద్య ఆరోగ్యసిబ్బంది, ఇతర వసతులపై భారం ఉండదని భావించరాదని, ప్రభుత్వాలు ఇందుకు సిద్ధంగానే ఉండాలని సూచించారు.