
Covid Vaccine: కొవిడ్ టీకా అని చెప్పి.. కు.ని. చికిత్స!
జైపూర్: అతనో రోజుకూలీ. కరోనా టీకా వేయిస్తానని ఓ వ్యక్తి చెబితే నమ్మాడు. రూ.2,000 ఇచ్చి మరీ అతని వెంట వెళ్లి మోసపోయాడు. వాస్తవానికి కొవిడ్ టీకాను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తోంది. ఈ అవగాహన లేనివారిని కొంతమంది ఇలా మోసగిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లా ప్రతాప్‌నగర్ ప్రాంతానికి చెందిన కైలాశ్పుత్ర బాబూలాల్.. డిసెంబరు 29 ఉదయం కూలీపనికి వెళ్లేందుకు నిలుచొని ఉండగా.. నరేశ్ అనే వ్యక్తి మాట కలిపాడు. రూ.2,000 ఇస్తే కరోనా టీకా వేయిస్తానని చెప్పి.. స్కూటీ మీద పులాలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి కైలాశ్‌కు ఇంజెక్షను ఇవ్వగా.. వెంటనే స్పృహ తప్పింది. ఆ తర్వాత అతనికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేశారు. విషయం తెలిసి.. భుపాల్పుర పోలీసులకు కైలాశ్ ఫిర్యాదు చేశాడు. తమకు కైలాశ్ ఒక్కడే కుమారుడని.. అతనికి పెళ్లైనా ఇంకా సంతానం లేదని తల్లి భోరుమంటోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.