Omicron: ఒమిక్రాన్‌ బాధితులకు ఆస్పత్రుల్లో చేరాల్సిన ముప్పు తక్కువే

డెల్టా వేరియంట్‌తో పోలిస్తే... ఒమిక్రాన్‌ బాధితులకు ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పు తక్కువేనని మరో అధ్యయనం తేల్చింది! 

Updated : 02 Jan 2022 10:41 IST

మరో అధ్యయనంలో నిర్ధారణ

లండన్‌: డెల్టా వేరియంట్‌తో పోలిస్తే... ఒమిక్రాన్‌ బాధితులకు ఆసుపత్రుల్లో చేరాల్సిన ముప్పు తక్కువేనని మరో అధ్యయనం తేల్చింది! వీరిలో మూడింట ఒక వంతు మందికే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావొచ్చని పేర్కొంది. యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్‌ఎస్‌ఏ) పరిశోధకులు... గత నవంబరు-డిసెంబరు మధ్య నమోదైన సుమారు 5.28 లక్షల ఒమిక్రాన్, 5.73 లక్షల డెల్టా కేసులను విశ్లేషించింది. కొత్త వేరియంట్‌తో తీవ్ర అనారోగ్యం, హాస్పిటలైజేషన్‌ ముప్పు తక్కువేనంటూ ఇదివరకు వచ్చిన ఇతర అధ్యయనాలు, శాస్త్రవేత్తల వాదనలను తాజా అధ్యయనం మరింత బలోపేతం చేసింది. ఒమిక్రాన్‌ కట్టడికి కొవిడ్‌ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తాయని కూడా యూకేహెచ్‌ఏఎస్‌ అధ్యయనం వెల్లడించింది. ఎలాంటి టీకా తీసుకోనివారితో పోలిస్తే... రెండు డోసులు తీసుకున్నవారికి ఒమిక్రాన్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి 65%, బూస్టర్‌ డోసు తీసుకున్నవారికైతే 81% తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. అయితే, దీనిపై ఇప్పుడే ఒక స్పష్టమైన నిర్ధారణకు రావడం మాత్రం తొందరపాటు చర్యే అవుతుందని యూకేఎస్‌హెచ్‌ఏ ముఖ్య వైద్య సలహాదారు సుసాన్‌ హాప్కిన్స్‌ అన్నారు. ఒమిక్రాన్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తుండటం, ఇంగ్లండ్‌లో 60 ఏళ్లు దాటినవారిలో కేసులు పెరుగుతుండటంతో సమీప భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పడే పరిస్థితులు ఉంటాయన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని