
Akhilesh yadav: కృష్ణుడు నా కలలోకి వస్తాడు.. రామరాజ్యం వస్తుందని చెప్తాడు: అఖిలేశ్ యాదవ్
లఖ్‌నవూ: ‘శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి రాత్రి నాకు కలలోకి వస్తాడు. రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతుంటారు’ అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ చెప్పారు. భాజపాకు చెందిన శాసనసభ్యుడు మాధురి వర్మ ఆ పార్టీ నుంచి ఎస్పీలో చేరుతున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన సభలో యాదవ్ మాట్లాడారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని ధీమా వ్యక్తంచేశారు. ‘రామరాజ్యానికి సామ్యవాదమే (సమాజ్‌వాద్) మార్గం. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజు రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పడుతుంది’ అని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్నిటా విఫలమయిందన్నారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల సంరక్షకులు అనుచిత పద్ధతుల్లో వారికి పరీక్షా కేంద్రాల్లో సాయపడే రీతిలోనే యూపీలో భాజపా నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం కోసం దండెత్తుతున్నారని విమర్శించారు. సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తే ఇళ్లకు నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.