Supreme Court: హైకోర్టుపై నిరాధార ఆరోపణలు.. పిటిషనర్‌కు రూ.25 లక్షల జరిమానా

ఉత్తరాఖండ్‌ హైకోర్టుతోపాటు కొందరు ప్రభుత్వ మాజీ అధికారులపై ‘ఆమోదయోగ్యం’ కాని నిరాధార ఆరోపణలు

Published : 05 Jan 2022 10:17 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ హైకోర్టుతోపాటు కొందరు ప్రభుత్వ మాజీ అధికారులపై ‘ఆమోదయోగ్యం’ కాని నిరాధార ఆరోపణలు చేసిన ఓ పిటిషనర్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ తరహా కేసుల విషయంలో ఓ హెచ్చరికలా నిలిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ కేసు విచారణలో తనను ఇంప్లీడ్‌ చేయాలంటూ అతడు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. ఆ దరఖాస్తులో పిటిషన్‌దారు అలాంటి ఆరోపణలు చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. దరఖాస్తును చాలా సాధారణ పద్ధతిలో భర్తీ చేయడాన్ని కూడా తప్పుపట్టింది. జరిమానాను నాలుగు వారాల్లోపు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని, లేనిపక్షంలో హరిద్వార్‌ కలెక్టరు అతడి నుంచి ఆ సొమ్మును రాబట్టాలని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఖాస్గీ(దేవీ అహిల్యాబాయ్‌ హోల్కర్‌ ఛారిటీస్‌) ట్రస్టుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది. విచారణ సందర్భంగా ఆ దరఖాస్తును ఉపసంహరించుకునేందుకు అనుమతినివ్వాలంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించగా, ధర్మాసనం తిరస్కరించింది. ‘‘ఎందుకు అనుమతించాలి? మీరు వస్తారు.. అన్ని రకాల ఆరోపణలు చేస్తారు. మొదట కొడతారు. తర్వాత క్షమాపణలు చెబుతారు’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. హోల్కర్‌ రాజవంశానికి చెందిన 246 దాతృత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే యాజమాన్య హక్కులు ఉంటాయని మధ్యప్రదేశ్‌ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి కొందరు వ్యక్తులపై నేర విచారణకు ఆదేశించింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనిపై ఇప్పటికే స్టే విధించింది. దాన్ని ఇప్పుడు రద్దు చేయడానికి అంగీకరించమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి మూడో వారంలో చేపడతామని పేర్కొంది. 


నాలుగేళ్లనాటి జరిమానాను విరాళంగా మార్చాలని అభ్యర్థన

దిల్లీ: నాలుగేళ్ల క్రితం ఓ వ్యాజ్యంలో తాము జరిమానాగా చెల్లించిన రూ.25లక్షల మొత్తాన్ని విరాళంగా మార్చాలంటూ ఓ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్రిసభ్య ధర్మాసనం పిటిషనర్లకు అపరాధ రుసుం విధించినందున తాజా అభ్యర్థనను కూడా అటువంటి ధర్మాసనమే పరిశీలించడం సముచితమని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ మంగళవారం తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైద్య కళాశాలల కుంభకోణం కేసులను ముడుపులు తీసుకొని సెటిల్‌చేశారని ఆరోపించడంతో పాటు ఆ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించాలంటూ క్యాంపెయిన్‌ ఫర్‌ జ్యుడీషియల్‌ అకౌంటబిలిటీ అండ్‌ రిఫామ్స్‌(సీజేఏఆర్‌) సంస్థ పిటిషన్‌ దాఖలు చేయగా సుప్రీంకోర్టు దానిని తోసిపుచ్చడంతో పాటు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్‌బీఏ) న్యాయవాదుల సంక్షేమ సంఘ నిధికి జమ చేయాలని 2017 డిసెంబరు ఒకటో తేదీన వెలువరించిన ఉత్తర్వుల్లో త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆ మేరకు సీజేఏఆర్‌.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జరిమానా మొత్తాన్ని అందించింది. అయితే, తాజాగా సీజేఏఆర్‌...సుప్రీంకోర్టుకు ఒక అభ్యర్థన చేసుకుంది. తమ సంస్థలో మాజీ జడ్జీలు, సీనియర్‌ న్యాయవాదులు, ఇతరులు సభ్యులుగా ఉన్నారని, ధర్మాసనం ఆదేశంలో ‘జరిమానా’గా పేర్కొనడం తమకు అపవాదును ఆపాదించేలా ఉందని, దానిని విరాళంగా మార్చాలని కోరింది. ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని కోరడంలేదని, అది ఎక్కడకు చేరినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. పిటిషనర్లు తాము చెల్లించిన సొమ్మును జరిమానాగా కాకుండా విరాళంగా మాత్రమే మార్చమని కోరుతున్నారని, ఇది ఎస్‌సీబీఏకు సమ్మతమేనని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వెల్లడించారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని