
భావప్రకటన స్వేచ్ఛకు మర్యాదపూర్వక భాషే ఆలంబన
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వార్ధా: పౌరులు మర్యాదపూర్వకమైన భాష, పదాల క్రమశిక్షణతో భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. నాగరిక సమాజం మాట్లాడే భాష సున్నితంగా, సంస్కారవంతంగా, సృజనాత్మకంగా ఉండాలన్నారు. మహారాష్ట్ర వార్ధా జిల్లాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు అటల్ బిహారీ వాజ్పేయీ భవన్, చంద్రశేఖర్ ఆజాద్ వసతి గృహాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లోని సంస్కృతి, సాహిత్య రచనలు నాగరిక సంభాషణను కలిగి ఉండాలి తప్ప సంఘర్షణను కలిగించే విధంగా ఉండరాదన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత రాజ్యాంగ సభ హిందీని అధికారిక భాషగా అంగీకరించిందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఇతర భాషలకు ఎనిమిదో షెడ్యూల్లో రాజ్యాంగ హోదా కల్పించిందని పేర్కొన్నారు. ‘‘మన దేశంలో భాషాభిన్నత్వం ఉండడం మన అదృష్టం. అదే మన బలం. సాంస్కృతిక ఏకత్వాన్ని మన భాషలు ప్రతిబింబిస్తున్నాయి’’ అని ఉపరాష్ట్రపతి చెప్పారు. జాతీయ భాషగా హిందీ ఉండాలని మహాత్మా గాంధీ పట్టుబట్టినప్పటికీ, ప్రజల మాతృభాషల పట్ల సున్నిత మనస్తత్వంతో వ్యవరించారని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం గాంధీ బోధనలకు అనుగుణంగా ఉంటుందని, ప్రాథమిక, మాధ్యమిక స్థాయుల్లో మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. ఈ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్, స్పానిష్ లాంటి విదేశీ భాషలను హిందీలో బోధిస్తుండడంపై ఉపరాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు.