Omicron: ప్రపంచం.. కరోనాతో కలవరం!

వాషింగ్టన్, లండన్, బెర్లిన్‌: కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది.

Updated : 06 Jan 2022 11:44 IST

అమెరికాలో 95% ఒమిక్రాన్‌ కేసులే
ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2.71 లక్షల మందికి వైరస్‌

వాషింగ్టన్, లండన్, బెర్లిన్‌: కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.67 లక్షల మందికి వైరస్‌ సోకింది. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్ష మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొత్త కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటాయని భావిస్తున్నట్లు వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) పేర్కొంది. గత రెండు వారాలుగా అమెరికాలో రోజుకు సగటున 4.80 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానయాన సంస్థలు సిబ్బంది కొరతతో సతమతం అవుతున్నాయి. గత వారంలో రోజుకు సగటున 14,800 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 63 శాతం అధికం. 

- ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఫ్రాన్స్‌లో మంగళవారం ఒక్కరోజే 2,72,686 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఇటలీలో మంగళవారం 1,70,844 కేసులు నమోదయ్యాయి. 222 మంది ప్రాణాలు కోల్పోయారు. 30వేల మంది వైరస్‌ను జయించారు. 

- స్పెయిన్‌లో ఒమిక్రాన్‌ విజృంభణతో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,17,775 మందికి వైరస్‌ సోకింది. 116 మంది మరణించారు. 13వేల మంది వైరస్‌ను జయించారు.

కొత్త వేరియంట్‌ను అధిగమించగలం: బోరిస్‌

బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 2,18,274 మందికి వైరస్‌ సోకింది. 48 మంది మరణించగా 50వేల మంది వైరస్‌ను జయించారు. ఇంగ్లండ్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన మంత్రిమండలికి సిఫార్సు చేశారు. లాక్‌డౌన్‌కు బదులు ప్రణాళిక ‘బి’ అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయడం, వీలున్న చోటల్లా సిబ్బంది ఇంటి నుంచి పని చేయడం, భారీస్థాయి కార్యక్రమాలకు హాజరయ్యేవారి టీకా ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయడం వంటివి ఉన్నాయి. ‘‘లాక్‌డౌన్లు లేకుండానే ఒమిక్రాన్‌ దశను అధిగమించేందుకు మనకో అవకాశం ఉంది. పాఠశాలలను, వ్యాపారాలను తెరిచే ఉంచగలం. ఈ వైరస్‌తో సహజీవనం చేసే మార్గాన్ని మనం గుర్తించగలం’’ అని బోరిస్‌ చెప్పారు.  

ఇజ్రాయెల్‌లో సరికొత్త రికార్డు

ఇజ్రాయెల్‌లో బుధవారం రికార్డు స్థాయిలో 11,978 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది డెల్టా వేరియంట్‌ ఉద్ధృతి సమయంలో సెప్టెంబరు రెండో తేదీన నమోదైన 11,345 కేసులే ఇప్పటివరకు రికార్డు కాగా, ఇప్పుడు అది తుడిచిపెట్టుకుపోయింది. 

భారత విమానాలపై హాంకాంగ్‌ నిషేధం
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హాంకాంగ్‌ కొవిడ్‌-19 ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. భారత్‌ సహా ఎనిమిది దేశాల నుంచి విమానాల రాకను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. జనవరి 21 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని హాంకాంగ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని