Gas Bore well: బోరు బావి నుంచి వంట గ్యాస్‌..

ఎల్పీజీ సిలిండరు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఆ ఇంట్లో వాళ్లు మాత్రం

Updated : 06 Jan 2022 14:51 IST

కేరళలోని అలప్పుజ జిల్లాలో వింత

ఎల్పీజీ సిలిండరు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ఆ ఇంట్లో వాళ్లు మాత్రం నిశ్చింతగా వంట గ్యాస్‌ను ఉపయోగించుకుంటారు. అసలు బయట మార్కెట్‌లోని గ్యాస్‌ ధరలను పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన వంట గ్యాస్‌.. బోరుబావి నుంచి వస్తోంది. తొమ్మిదేళ్లగా వారు ఇలా పెరటి గ్యాస్‌నే వాడుతున్నారు. ఈ వింతను చూడాలంటే కేరళలోని అలప్పుజ జిల్లా వెళ్లాల్సిందే. అరుత్తువళి ప్రాంతంలో నివాసం ఉంటున్న రత్నమ్మ కుటుంబం నీటి కొరత భరించలేక బోరు తవ్వించాలని నిశ్చయించింది. 16 మీటర్లు తవ్వినా ఎక్కడా చుక్క నీరు లభించలేదు. అదే సమయంలో పైపు దగ్గర ఉన్న వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించేసరికి భగ్గుమంటూ మంటలు వచ్చాయి.

మొదట దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. గ్యాస్‌ లీక్‌ కొనసాగడంతో ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు రత్నమ్మ నివాసానికి వచ్చి పరీక్షలు నిర్వహించారు. బోరుబావి నుంచి వస్తున్న గ్యాస్‌ మీథేన్‌ అని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అనంతరం రత్నమ్మ ప్లంబర్‌ను పిలిచి బోరు నుంచి పొయ్యికి పైపులు బిగించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం పెరటి గ్యాస్‌నే వినియోగిస్తోంది. మొదట ఈ గ్యాస్‌ వల్ల పేలుడు జరిగే అవకాశం ఉందని భయపడ్డామని.. ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదని రత్నమ్మ చెప్పారు. ఈ ప్రాంతంలో వరదలు వస్తే తప్ప గ్యాస్‌కు కొరత ఏర్పడదని పేర్కొన్నారు. మరోవైపు, ఈ వింతను చూసేందుకు చాలా మంది పరిశోధక విద్యార్థులు రత్నమ్మ ఇంటికి వస్తున్నారు. గ్యాస్‌ నమూనాలు సేకరిస్తున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని