
CBSE: సీబీఎస్‌ఈ కొత్త నిబంధన కొట్టివేత
12వ తరగతి మార్కులపై సుప్రీంకోర్టు తీర్పు
ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశం
దిల్లీ: విద్యార్థులు చివరిగా రాసిన పరీక్షలో సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామంటూ గత ఏడాది జూన్‌లో సీబీఎస్‌ఈ తీసుకొచ్చిన నిబంధనను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 12వ తరగతి విద్యార్థుల తుది మార్కులను ఖరారు చేయడానికి సంబంధించి జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రెండు పరీక్షలకు సంబంధించిన మార్కుల్లో ఏదో ఒక దానినే ఖరారు చేయాల్సి వస్తే... తనకు ఉత్తమమైన స్కోరును ఎంచుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని స్పష్టం చేసింది. గత ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు తొలుత సకాలంలో పరీక్ష నిర్వహించలేకపోయింది. ఆ సమయంలో 30:30:40 పద్ధతిలో మార్కులు కేటాయిస్తామని తెలిపింది. అది ఇష్టంలేని వారు పరీక్ష రాసుకోవచ్చని తెలిపింది. అయితే, చివరిగా రాసిన పరీక్షలో వచ్చిన మార్కులనే ఖరారు చేస్తామంటూ సీబీఎస్‌ఈ తన విధానంలో మార్పు తీసుకొచ్చింది. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్ష రాసిన విద్యార్థుల్లో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే సీబీఎస్‌ఈ కొత్త నిబంధనను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తీప్పునిచ్చింది.
30:30:40 ఫార్ములా అంటే...
12వ తరగతి చదివే విద్యార్థికి 30శాతం మార్కులను అతను/ఆమె పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా, 30శాతం మార్కులను 11వ తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా, 40 శాతం మార్కులను..12వ తరగతిలోని యూనిట్, మిడ్‌టర్మ్ తదితర పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా కేటాయించడం. ఈ ఫార్ములాలో మార్కులు కేటాయించిన తర్వాత గత ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసుకొనే అవకాశాన్ని కల్పించింది. చివరిగా రాసిన ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే ఖరారు చేస్తామనడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం తెలిపారు.
ఉమ్మడి ఉద్దేశం ఉన్నంతమాత్రాన సెక్షన్ 34 వర్తించదు
దిల్లీ: ఒక నేరంలో స్వతహాగా ఉమ్మడి ఉద్దేశం ఉన్నంత మాత్రాన ‘తోడ్పాటు చర్యలు లేకుండా’ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్-34 వర్తించకపోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎక్కువమంది కలిసి ఒక నేరానికి పాల్పడినప్పుడు వారందరి ఉద్దేశం ఒక్కటే అయినా ఆ నేరాన్ని ఒక్కరే చేసిన రీతిలో ప్రతి ఒక్కరూ బాధ్యులేనని ఈ సెక్షన్ చెబుతోంది. నేరం చేయాలన్న ఉమ్మడి ఉద్దేశంలో ఒక వ్యక్తి క్రియాశీల పాత్ర పోషించినా, తర్వాత దాని నుంచి వైదొలగే అవకాశం ఉంటుందని జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌ల ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఈ సెక్షన్ కింద చర్యలు చేపట్టేటప్పుడు కోర్టులు దీనిని విశ్లేషించి సాక్ష్యాలను మదించాలని వ్యాఖ్యానించింది. నలుగురు ముద్దాయిలకు 2019లో పంజాబ్-హరియాణా హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ వీరిలో ఇద్దరు దాఖలు చేసిన అప్పీళ్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. న్యాయస్థానం సంతృప్తి చెందేలా తగిన రీతిలో, పక్కాగా, కచ్చితంగా, విస్పష్టంగా సాక్ష్యాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పైనే ఉందని పేర్కొంది. ఇద్దరు నిందితులపై హైకోర్టు తీర్పును కొట్టివేసింది.