Updated : 09 Jan 2022 11:34 IST

Supreme Court:అగ్నిప్రమాదాలను దైవచర్యగా భావించలేం

ఆకస్మిక విపత్తుల వల్ల సంభవిస్తేనే.. పరిగణనలోకి తీసుకుంటాం
 ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’పై సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: ప్రకృతిలో సహజంగా సంభవించే తుపాన్లు, వరదలు, భూకంపాలు, పిడుగులు వంటి వాటి కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలనే న్యాయ పరిభాషలో దైవిక చర్య(యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌)గా భావించగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఒకవేళ అగ్గిరాజుకున్నా దానిని ఆర్పే సాధనాలు అందుబాటులో ఉంటే నష్టాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించవచ్చు. ఇవేవీ పాటించని పరిస్థితుల్లో జరిగే అగ్ని ప్రమాదాలన్నిటినీ దైవిక చర్యలుగా పరిగణనలోకి తీసుకోబోమని జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరీ, జస్టిస్‌ కృష్ణ మురారీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. విద్రోహం, ఉద్దేశపూరిత చర్యల వల్ల ప్రమాదం జరిగితే అది వేరే విషయమని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దైవిక చర్యగా పేర్కొనడంతో పాటు ఆ సంస్థకు ఎక్సైజ్‌ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సమర్థనీయంగా లేదని స్పష్టం చేసింది. పన్నుల కింద రూ.6.39 కోట్లు చెల్లించాల్సిందిగా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ ఎక్సైజ్‌ శాఖ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మద్యం తయారీ కంపెనీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా...దైవిక చర్యలో తీవ్ర నష్టం కలిగినందున పన్ను చెల్లింపు నుంచి మినహాయింపునివ్వాలంటూ తీర్పు వెలువడింది. యూపీ ప్రభుత్వం దీనిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 2003 ఏప్రిల్‌ 10వ తేదీ రాత్రి జరిగిన అగ్ని ప్రమాద పరిస్థితులు, తద్వారా ఆస్తినష్టం తదితరాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే...మానవ ప్రయత్నం ద్వారా ముందుగానే అటువంటి ప్రమాదాన్ని నివారించడం సాధ్యమవుతుందనే అభిప్రాయం కలుగుతుందనిసర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.

కోర్టు ఉద్యోగుల అవినీతిని సమర్థించం

న్యాయస్థానాల్లో అవినీతి సమర్థనీయం కాదని, ముడుపులు డిమాండ్‌ చేయరాదన్న నిబంధన జడ్జీలతో పాటు ఉద్యోగులందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్‌లోని జిల్లా కోర్టులో పనిచేసిన ఉద్యోగి ఒకరు రూ.50వేల లంచం తీసుకున్న నేరం నిర్ధరణ కావడంతో సర్వీసు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. 24 ఏళ్ల పాటు సేవలందించిన తనకు దిగువ కోర్టులు విధించిన శిక్ష మరింత కఠినంగా ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టుల తీర్పును సమర్థించింది. సర్వీసును పునరుద్ధరించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. తప్పుచేసినట్లు పిటిషనరే ఒప్పుకున్నందున అతనికి ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. ముడుపులు స్వీకరించడం, నిందితులను అందుకోసం డిమాండ్‌ చేయడం వంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, ఈ నిబంధనలు జడ్జీలకు మాత్రమే కాదు న్యాయస్థానంలో పనిచేసే వారందరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది. పిటిషనర్‌కు విధించిన శిక్షను ‘ఉద్వాసన’(డిస్మిసల్‌)కు బదులు... ‘తొలగింపు’(రిమూవల్‌)గా మార్చుతున్నట్లు తెలిపింది. దీనివల్ల అతను మరేదైనా ఉద్యోగం పొందడానికి వీలుకలుగుతుందని ధర్మాసనం పేర్కొంది. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని