DefenceMinistry:రక్షణశాఖ చేతిలో 17.99 లక్షల ఎకరాల భూమి

దేశవ్యాప్తంగా రక్షణశాఖ చేతిలో 17.99 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది.

Updated : 10 Jan 2022 10:18 IST

ఆధునిక సాంకేతికతతో మూడేళ్లలో సర్వే పూర్తి

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా రక్షణశాఖ చేతిలో 17.99 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది. ఇందులో 1.61 లక్షల ఎకరాలు 62 కంటోన్మెంట్‌ల పరిధిలో ఉండగా, 16.38 లక్షల ఎకరాలు వాటి వెలుపల ఉన్నట్లు వెల్లడైంది. అందులో 18,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వాలు అద్దెకు తీసుకోవడమో లేదంటే ఇతర ప్రభుత్వ విభాగాలకు కేటాయించడమో జరిగింది. అందువల్ల ఆ 18,000 ఎకరాలను రక్షణశాఖ రికార్డుల నుంచి తొలగించాలని ప్రతిపాదించారు. రక్షణశాఖ భూములను గుర్తించి, వాటి సరిహద్దులను పక్కాగా నిర్ధారించడానికి డైరెక్టరేట్‌ జనరల్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ 2018 అక్టోబర్‌ నుంచి రక్షణ భూముల సర్వే ప్రారంభించింది. మూడేళ్లలో పూర్తిచేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం రక్షణశాఖ భూములను సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 4,900 పాకెట్స్‌లో ఉన్న ఈ భూముల సర్వేను వివిధ రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ అధికారులతో కలిసి పూర్తిచేసింది.

సర్వేకోసం ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌ (ఈటీఎస్‌), డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (డీజీపీఎస్‌) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ కార్యక్రమాన్ని నమ్మకంగా, వేగంగా, నిర్దిష్టంగా కొనసాగించడానికి డ్రోన్, శాటిలైట్‌ ఇమేజెరీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. రాజస్థాన్‌లోని లక్షల ఎకరాల రక్షణ భూమిని కొలవడానికి తొలిసారి ఉపగ్రహ చిత్రాల సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. మొత్తం 17.78 లక్షల ఎకరాల భూమిలో 8.90 లక్షల ఎకరాల సర్వేని గత మూడు నెలల్లోనే పూర్తిచేశారు. రక్షణ భూముల్లో ఆక్రమణలను గుర్తించడానికి టైం సిరీస్‌ శాటిలైట్‌ ఇమేజెరీ ఆధారిత రియల్‌ టైం ఛేంజ్‌ డిటెక్షన్‌ ప్రాజెక్ట్‌ కూడా చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ నుంచి సేకరించిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద రక్షణ భూముల ఉపగ్రహ చిత్రాల మీద ప్రయోగించారు.

సర్వే చేసిన భూముల వివరాలను డిజిటల్‌ దస్త్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని రక్షణశాఖ పేర్కొంది. ఆధునిక భూ సర్వే సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఇంత బృహత్తర కార్యక్రమం వేగవంతంగా పూర్తయినట్లు రక్షణశాఖ తెలిపింది. ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో డిఫెన్స్‌ ఎస్టేట్‌ అధికారులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంచడానికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ మేనేజ్‌మెంట్‌లో కొత్తగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ సర్వేస్‌ అండ్‌ జీఐఎస్‌ మ్యాపింగ్‌ను ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని