IIT Kanpur:త్వరలో దేశీయ కృత్రిమ గుండె

కృత్రిమ గుండెను తయారు చేసేందుకు ఐఐటీ కాన్పుర్‌ పూనుకుంది.

Updated : 10 Jan 2022 11:08 IST

కార్యదళం ఏర్పాటు చేసిన ఐఐటీ కాన్పుర్‌

కృత్రిమ గుండెను తయారు చేసేందుకు ఐఐటీ కాన్పుర్‌ పూనుకుంది. ఈ మేరకు ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేసి కృత్రిమ హృదయాన్ని రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు, అమెరికా నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన సీనియర్‌ వైద్యులతో కూడిన బృందం ఈ కార్యదళంలో భాగమైంది. వైద్య రంగంలో ఐఐటీ కాన్పుర్‌ సాధించిన ఘనతలపై చర్చించే సమావేశంలో కృత్రిమ గుండె ఏర్పాటు ప్రాజెక్టుకు బీజం పడింది. లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ అసిస్ట్‌ డివైస్‌ (ఎల్‌వీఏడీ) పేరుతో ఈ కృత్రిమ గుండెను రూపొందించనున్నారు.

‘‘కరోనా సమయంలో ఐఐటీ కాన్పుర్‌ తక్కువ ధరతో కూడిన వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తయారు చేసింది. కృత్రిమ గుండెను మాత్రం తయారు చేయలేమని కొంతమంది అన్నారు. దీన్ని మా విద్యాసంస్థ సవాల్‌గా స్వీకరించింది. వెంటనే కార్యదళం ఏర్పాటు చేశాం’’ అని ఐఐటీ కాన్పుర్‌ ఆచార్యుడు అమితాబ్‌ బంధోపాధ్యాయ్‌ తెలిపారు. కృత్రిమ గుండె పరికరం సిద్ధం కావడానికి రెండేళ్లు పడుతుందని, అనంతరం జంతువులపై ప్రయోగిస్తామని చెప్పారు. దశల వారీగా పూర్తిస్థాయిలో ఈ పరికరాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. పరికరం మార్కెట్‌లోకి వచ్చేందుకు ఐదేళ్లు పడుతుందన్నారు. రీఛార్జ్‌ చేసుకోగలిగే ఎనిమిది బ్యాటరీలను కృత్రిమ గుండెలో అమర్చనున్నట్లు తెలిపారు. బ్యాటరీలు 12 గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఇలాంటి కృత్రిమ గుండె పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి ధర చాలా అధికంగా ఉంటోంది. ఐఐటీ కాన్పుర్‌ తయారు చేసే పరికరం ధర మాత్రం చాలా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని