UP Elections: 50 లక్షల మందితో మోదీ 3డీ సభ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్చువల్‌ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కమలనాథులు హంగులు అద్దుతున్నారు.

Published : 12 Jan 2022 11:03 IST

డిజిటల్‌ అస్త్రాలతో యూపీ సమరం

ఉత్తర్‌ప్రదేశ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్చువల్‌ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కమలనాథులు హంగులు అద్దుతున్నారు. వందలాది చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి.. మోదీ ప్రసంగాన్ని త్రీడీ ప్రొజక్షన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సంక్రాంతి తర్వాత జరిగే ఈ ర్యాలీ కోసం భాజపా ఏర్పాట్లు చేస్తోంది. భౌతిక ర్యాలీలపై ఈ నెల 15 వరకు నిషేధం ఉన్న నేపథ్యంలో వీలైనంతమందికి చేరువయ్యేలా ఆన్‌లైన్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రధాని వర్చువల్‌ ప్రతిరూపాన్ని రూపొందించే కసరత్తు చేస్తున్నట్లు భాజపా ఐటీ సెల్‌ వర్గాలు ‘ఈటీవీ భారత్‌’కు వెల్లడించాయి. 100-200 మంది హాజరయ్యే భౌతిక సమావేశాల్లో మోదీ డిజిటల్‌ రూపాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. మోదీ ప్రసంగించేది దిల్లీ నుంచే అయినా సభలకు హాజరైనవారికి మాత్రం ఆయన తమ ఎదుటే వేదికపై నిల్చొని ప్రసంగిస్తున్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నాయి. తద్వారా భౌతిక ర్యాలీలు ఏర్పాటు చేసిన అనుభూతి కలుగుతుందన్నాయి. ఇలా చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలకు చేరువయ్యే వీలుంటుందని చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా ఈ సాంకేతికతను ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించింది.

ఇంటింటికీ కరోనా అంటిస్తోంది: ఎస్పీ
రాష్ట్రంలో ఇంటింటి ప్రచారాన్ని భాజపా ప్రారంభించింది. యూపీ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌.. లఖ్‌నవూలోని బల్లూఅడ్డా ప్రాంత ప్రజలను కలిశారు. ప్రజలకు తమ ప్రగతి నివేదిక అందించి, వారి నుంచి సూచనలు తీసుకుంటున్నామని స్వతంత్ర దేవ్‌ తెలిపారు. భాజపా ఇంటింటికీ వెళ్లి కరోనా అంటిస్తోందని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెడుతోందని సమాజ్‌వాదీ ఆక్షేపించింది.

యోగి, షా భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. తొలి దశలో ఎన్నికలు జరిగే స్థానాలకు అభ్యర్థులను వడపోసిన నేపథ్యంలో వీరి భేటీ జరగడం విశేషం. కరోనా బారిన పడ్డ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వర్చువల్‌గా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని