Kanhaiya kumar: కాంగ్రెస్‌ నేత కన్నయ్య కుమార్‌పై యాసిడ్‌ దాడి యత్నం

కాంగ్రెస్‌ నేత, దిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై మంగళవారం ఓ యువకుడు యాసిడ్‌ దాడికి యత్నించడం..

Published : 02 Feb 2022 10:59 IST

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ నేత, దిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై మంగళవారం ఓ యువకుడు యాసిడ్‌ దాడికి యత్నించడం కలకలం రేపింది. అయితే కన్నయ్య కుమార్‌ తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్నవూలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో నిర్వహించిన యువజన సమావేశంలో పాల్గొనేందుకు కన్నయ్య అక్కడకు చేరుకున్నారు.

ఆయన వేదిక ఎక్కిన వెంటనే బయటి నుంచి వచ్చిన ఓ యువకుడు కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపై యాసిడ్‌ చల్లేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కార్యకర్తలు ఆ యువకుణ్ని అడ్డుకోవడంతో అపాయం తప్పింది. దీనిపై పార్టీ నేతలు మాట్లాడుతూ ఇది కుట్రలో భాగంగానే జరిగిందని, ఆ యువకుడు భాజపాకు చెందినవాడని ఆరోపించారు.

అఖిలేశ్, శివపాల్‌లపై పోటీకి దూరంగా కాంగ్రెస్‌
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఆయన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌లపై కాంగ్రెస్‌ పార్టీ ఎవరినీ పోటీకి నిలపలేదు. వీరిద్దరూ వరుసగా కర్హాల్, జశ్వంత్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగారు. నామినేషన్ల దాఖలుకు గడువు మంగళవారంతో ముగియగా.. ఎస్పీతో పరస్పర అవగాహనతోనే ఈ రెండు స్థానాల నుంచి అభ్యర్థులను నిలపలేదని యూపీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ ప్రధాన్‌ తెలిపారు. తొలుత కర్హాల్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అక్కడి నుంచి అఖిలేశ్‌ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో తాము విరమించుకున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లోనూ రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్‌పై ఎస్పీ ఎవరినీ పోటీకి నిలపని సంగతి తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌కు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అఖిలేశ్‌ పోటీ చేస్తుండగా, శివపాల్‌ యాదవ్‌ ఆరోసారి తలపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని