Agnipath scheme: కేంద్రం ఓ కాపీ క్యాట్‌.. ఎత్తుకొచ్చిన పథకాలు ఇక్కడ సూట్‌ కావు: కాంగ్రెస్‌ ఎంపీ

Agnipath scheme: కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై (Agnipath scheme) కాంగ్రస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు దీపేందర్‌ హుడా మండిపడ్డారు.  

Published : 27 Jun 2022 01:07 IST

జైపుర్‌: కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై (Agnipath scheme) కాంగ్రస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు దీపేందర్‌ హుడా మండిపడ్డారు. ఇదో కాపీ పథకమని వ్యాఖ్యానించారు. విదేశాల్లో అమలౌతున్న పథకాలను కేంద్రం కాపీ కొట్టి ఇక్కడ రూపకల్పన చేస్తోందని విమర్శించారు. ఆ పథకాలు ఇక్కడ పరిస్థితులకు సరిపోవని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇక్కడ పీసీసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం కాపీ క్యాట్‌లా వ్యవహరిస్తోందని దీపేందర్‌ హుడా అన్నారు. మొన్నా మధ్య వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు కూడా అమెరికాలో కార్పొరేట్లే వ్యవసాయం చేస్తున్నారని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పుడు అగ్నిపథ్‌ విషయంలో ఇజ్రాయెల్‌ను కాపీ కొడుతున్నారని విమర్శించారు. కానీ విదేశాల్లో పరిస్థితులు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరని అన్నారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ వల్ల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు.

సైనికుడు తన భవిష్యత్‌కు భద్రత లేదని అనుకున్నప్పుడు అతడు సరిహద్దుల్లో ఎలా విధుల్లో పాల్గొనగలడని హుడా ప్రశ్నించారు. ఉదయాన్నే 4 గంటలకే లేచి మైదానంలో చెమటోడ్చి మిలటరీలో చేరాలనుకున్న యువత కలను మోదీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో చిదిమేసిందని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో గానీ, స్టాండింగ్‌ కమిటీలో గానీ ఎలాంటి చర్చా లేకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చించాలని, ఈ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలని హుడా డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని