SpiceJet: మరో స్పైస్‌జెట్‌ విమానంలో సమస్య.. 18 రోజుల్లో 8వ ఘటన

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. నిన్న ఈ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తిన

Published : 06 Jul 2022 13:31 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. నిన్న ఈ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా స్పైస్‌జెట్‌ కార్గో విమానం ఒకటి సాంకేతిక లోపంతో కోల్‌కతా వెనుదిరిగింది. ఈ ఘటన కూడా నిన్నే జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిన్న సాయంత్రం ఓ స్పైస్‌జెట్‌ బోయింగ్‌ 737 ఫ్రీటర్‌ (సరకు రవాణాకు ఉపయోగించే కార్గో విమానం) కోల్‌కతా నుంచి చాంగ్‌కింగ్‌(చైనా) బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికి విమానంలో వెదర్‌ రాడార్‌ (వాతావరణ సూచీ) పనిచేయడం లేదని కమాండ్ పైలట్‌ గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి కోల్‌కతా మళ్లించినట్లు స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కోల్‌కతా విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు తెలిపారు.

కాగా.. స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం 18 రోజుల్లో ఇది ఎనిమిదో ఘటన కావడం గమనార్హం. ఇందులో మూడు ఘటనలు మంగళవారమే చోటుచేసుకున్నాయి. నిన్న దిల్లీ నుంచి దుబాయి వెళ్తోన్న స్పైస్‌జెట్‌ విమానం ఒకటి పాక్‌ గగనతలంలో ఉండగా.. ఇంధన ఇండికేటర్‌ సరిగా పనిచేయలేదు. దీంతో విమానాన్ని వెంటనే కరాచీకి దారిమళ్లించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబయి వెళ్తోన్న మరో స్పైస్‌జెట్ విమానంలో.. 23వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌కు పగులు ఏర్పడింది. దీంతో పైలట్లు ముంబయి విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్‌ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని