NEET: ‘లోదుస్తులన్నీ ఒకే చోట.. చున్నీలు కూడా లేవ్‌’

పరీక్ష కేంద్రంలో తమకు ఎదురైన అవమానాలను బాధిత విద్యార్థిని ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. ‘పరీక్ష కేంద్రంలో విద్యార్థినుల తనిఖీల కోసం రెండు లైన్లు ఏర్పాటు ...

Updated : 20 Jul 2022 09:37 IST

కొల్లం: పరీక్ష కేంద్రంలో తమకు ఎదురైన అవమానాలను బాధిత విద్యార్థిని ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు. ‘పరీక్ష కేంద్రంలో విద్యార్థినుల తనిఖీల కోసం రెండు లైన్లు ఏర్పాటు చేశారు. కేంద్రం వద్దకు వెళ్లగానే ‘మెటల్‌ హుక్స్‌ ఉన్న బ్రా వేసుకున్నారా’ అని అడిగారు. అవునని చెప్పిన వారిని ఒక లైన్లోకి, మిగిలిన వారిని రెండో లైన్‌లోకి వెళ్లమన్నారు. సాధారణ తనిఖీలు చేస్తున్నారని అనుకున్నాం. కానీ గది వద్దకు వెళ్లగానే లోదుస్తులు విప్పేయాలని మహిళా సిబ్బంది ఆదేశించారు. అక్కడే ఉన్న డ్రాలో వాటిని పెట్టాలన్నారు. అబ్బాయిలు, అమ్మాయిల దుస్తులన్నీ ఒకే చోట ఉంచారు. పరీక్ష హాలులో అందరూ కలిసే కూర్చున్నారు. మెడలో చున్నీలాంటివి కూడా లేవు. మా జుట్టును ముందుకు వేసుకొని పరీక్ష రాశాం. చాలా అవమానంగా అనిపించింది. పరీక్షపై సరిగా దృష్టిసారించలేకపోయాం’ అని వివరించింది.

పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా లోదుస్తులు ధరించొద్దని సిబ్బంది చెప్పారని విద్యార్థిని వాపోయింది. ‘దుస్తులు వెంట తీసుకొని వెళ్లిపోవాలని చెప్పారు. చాలా మంది ఏడ్చారు. అధికారులు వద్దన్నా కొందరు విద్యార్థినులు అక్కడే గదిలో చీకటిగా ఉన్నచోటకు చేరి, లోదుస్తులు ధరించి ఇంటికి వెళ్లారు. చిన్న గదిలోనే అందరూ దుస్తులు ధరించాల్సి వచ్చింది’ అని విద్యార్థిని పేర్కొంది. ఈ విద్యార్థిని ఫిర్యాదు మేరకు పరీక్ష కేంద్రంలో ఎన్‌టీఏ తరఫున విధులు నిర్వహించిన ముగ్గురు మహిళలను, విద్యా సంస్థకు చెందిన ఇద్దరు మహిళలను మంగళవారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు విద్యార్థినులు కూడా తమకు అవమానం జరిగిందని తెలిపినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కేరళ మహిళా కమిషన్‌ కూడా తమకు అందిన ఫిర్యాదులు ఆధారంగా ఓ కేసు నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు