యాంటీ ట్రస్ట్‌ ఫిర్యాదులు.. గూగుల్‌పై ఒత్తిడి పెంచిన సీసీఐ

సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌పై భారత్‌కు చెందిన ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌.. ది కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా(సీసీఐ) పిడికిలి బిగించింది. గతకొన్ని రోజులుగా గూగుల్‌పై యాంటీట్రస్ట్‌ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మూడు ఫిర్యాదులను నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Published : 17 Oct 2022 18:40 IST

సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌పై భారత్‌కు చెందిన ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌.. ది కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్ ఇండియా(సీసీఐ) పిడికిలి బిగించింది. గతకొన్ని రోజులుగా గూగుల్‌పై యాంటీట్రస్ట్‌ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మూడు ఫిర్యాదులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ జరిపి గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిపేలా నివేదిక ఇవ్వాలని డైరెక్టర్‌ జనరల్‌ను ఇప్పటికే కోరింది.

సెర్చ్‌ ఇంజిన్‌ పేజీతో పాటు, న్యూస్‌ కేటగిరిలోనూ ఉచితంగా వార్తలను ప్రచురించుకునేందుకు గూగుల్‌ అవకాశం కల్పిస్తోంది. అందుకు ప్రతిగా ఆయా న్యూస్‌ పోర్టళ్లలో ప్రకటనలను ఇస్తుంది. వీటికి సంబంధించిన ఆదాయాలను సదరు మీడియా సంస్థలకు పంచడంలో గూగుల్‌ అనైతిక ధోరణులు అవలంబిస్తోందన్న ఆరోపణలపై సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారత్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో గూగుల్‌ మరింత అతిక్రమణలకు పాల్పడటాన్ని గుర్తించారు.

వార్తల ప్రచురణ, ఆదాయాల పంపకం విషయంలో గూగుల్‌ మరింత అలసత్వం, అనైతికత ప్రదర్శించటం మొదలు పెట్టింది. ఈ క్రమంలో గూగుల్‌ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే గూగుల్‌పై కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే గూగుల్‌పై డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌(డీఎన్‌పీఏ), ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ అసోసియేషన్‌(ఐఎన్‌ఏ)ల నుంచి ఫిర్యాదులు అందిన క్రమంలో సీసీఐ ఈ వ్యవహారంపై మరింత దృష్టిసారించింది.

ఇప్పుడు ఐఎన్‌ఏ, డీఎన్‌పీఏలతో కలిసి న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీడీఏ) కూడా సీసీఐకు ఫిర్యాదు చేసింది. ఆదాయ పంపకాల్లో గూగుల్‌ నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్లు పేర్కొంది. గూగుల్‌పై యాంటీ ట్రస్ట్‌ కేసులు కేవలం భారత్‌లోనే కాదు, ఆస్ట్రేలియా, యూరప్‌, యూఎస్‌ఏ, కెనడాలలోనూ నమోదుకావడం గమనార్హం. పక్షపాతవైఖరితో వ్యవహరిస్తూ మీడియా సంస్థలకు ఆదాయాన్ని పంచడంలో అప్రజాస్వామికంగా వ్యవహరించే యూఎస్‌కు చెందిన టెక్‌ కంపెనీలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఐటీశాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ‘గూగుల్‌ కొందరికి చెందిన వార్తలు/సమాచారం వాటి యూఆర్‌ఎల్స్‌ మాత్రమే మొదటి పేజీలో కనిపించేలా చేస్తోంది’ అని ఎన్‌బీడీఏ సీసీఐకు ఫిర్యాదు చేసింది.

ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని మీడియా సంస్థలకు సమంగా పంపిణీ చేసేలా టెక్‌ కంపెనీలను సన్నద్ధతం చేయటంలో భారత్‌ అతి చేరువలో ఉంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు కఠిన ఆంక్షలు విధించటం ద్వారా ఈ అంశంలో సఫలమయ్యాయి. ‘ఈ పనులన్నీ కాస్త నెమ్మదిగా జరగవచ్చు. కానీ, కచ్చితంగా జరుగుతుంది. ప్రతి మీడియా సంస్థకు సరైన ఆదాయ షేర్‌ అందుతుంది. దీనికి సంబంధించిన మార్గం సుస్పష్టం’ అని డీఎన్‌పీఏ వర్గాలు తెలిపాయి.

భారత్‌లో పాటు, ఇతర దేశాల్లోనూ నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్న టెక్‌ జెయింట్‌ గూగుల్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు సీసీఐ రంగం సిద్ధం చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీతో కలిసి కఠిన నియమ నిబంధనలకు సీసీఐ తుదిరూపం ఇచ్చింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఐటీ మంత్రిత్వశాఖ, ఇతర భాగస్వాములతో కలిసి వీటిని రూపొందించింది.

యాంటీట్రస్ట్‌ ఆరోపణల నేపథ్యంలో గూగుల్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ హెడ్‌ అర్చనా గులాటీ తన పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌ అతి పెద్ద మార్కెట్‌ కావడంతో గూగుల్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌లో గూగుల్‌ కార్యకలాపాలపై ఆ కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌.. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూతో ఇటీవల చర్చించారు. ముఖ్యంగా దేశంలో జరుగుతున్న డిజిటైజేషన్‌లో గూగుల్‌ పోషిస్తున్న కీలక పాత్రపై ఆయన ప్రధానంగా చర్చలు జరిపారు. అతి పెద్ద టెక్‌ కంపెనీ సీఈఓ భారత దౌత్యకార్యాలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. అదే విధంగా సీసీఐ దర్యాప్తును ఆపాలని కోరుతూ వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

భారత్‌ ఇంటర్నెట్‌ స్పేస్‌ను మరింత భద్రంగా,  ప్రజాస్వామికంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో ఐటీ నిబంధనలు-2021ను మరింత కఠినతరం చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు