మేం పౌర హక్కుల సంరక్షకులం

దేశంలోని సామాన్య పౌరుల హక్కులకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని, వారి స్వేచ్ఛకు తాము సంరక్షకులుగా ఉంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు.

Published : 18 Dec 2022 05:12 IST

అశోక్‌ దేశాయ్‌ స్మారకోపన్యాసంలో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

ముంబయి: దేశంలోని సామాన్య పౌరుల హక్కులకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని, వారి స్వేచ్ఛకు తాము సంరక్షకులుగా ఉంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. శనివారం ఆయన అశోక్‌ హెచ్‌.దేశాయ్‌ స్మారకోపన్యాసమిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం తన ముందుకు వచ్చిన విద్యుత్‌ చౌర్యం కేసును ప్రస్తావించారు. తాము ఇందులో జోక్యం చేసుకోపోతే నిందితుడు 18 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి వచ్చేదని అన్నారు. ‘‘నిన్న అంత అపాయకరం కాని కేసు ఒకటి మా ముందుకు వచ్చింది. ఇందులో విద్యుత్‌ పరికరాలు దొంగలించిన ఓ వ్యక్తికి సెషన్స్‌ కోర్టు 9 కేసుల్లో రెండేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి చెప్పడం మరిచిపోయారు. పర్యవసానమేంటంటే, విద్యుత్‌ స్తంభాలు దొంగిలించినందుకు అతడు 18 సంవత్సరాలు జైలు అనుభవించాల్సిన పరిస్థితి. దీనికి కారణం.. ఏకకాలంలో ఆ శిక్షలు అమలు చేయాలని ట్రయల్‌ కోర్టు చెప్పకపోవడమే. దీనిపై హైకోర్టు కూడా ఏమీ చేయలేమని చెప్పింది. కానీ.. నేరశిక్షాస్మృతి 427 ప్రకారం.. ఆ శిక్షలు ఏకకాలంలో అనుభవించాలి. మేం నిన్న ఆ కేసులో జోక్యం చేసుకున్నాం. మేం చెప్పేదేంటంటే పౌరుల స్వేచ్ఛకు సంరక్షకులుగా ఇక్కడ ఉంటాం. ఈ విషయాన్ని నమ్మండి. న్యాయస్థానాలకు చిన్నా, పెద్దా కేసులనే తేడా ఉండదు. ఏదైనా ఒకటే’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని