రద్దీలో ఉంటే మాస్కులు ధరించండి

రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడంతో పాటు కొవిడ్‌-19 సంబంధిత జాగ్రత్తల్ని పాటించాలని కేంద్రం సూచించింది. కరోనా కేసుల పరంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Published : 22 Dec 2022 04:36 IST

కరోనా ఇంకా అంతరించిపోలేదు
పండుగల వేళ అప్రమత్తత అవసరం
చైనా నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు
సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి మాండవీయ

దిల్లీ: రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడంతో పాటు కొవిడ్‌-19 సంబంధిత జాగ్రత్తల్ని పాటించాలని కేంద్రం సూచించింది. కరోనా కేసుల పరంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అనవసర భయాందోళన వద్దనీ, అప్రమత్తత మాత్రం అవసరమని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘కొవిడ్‌-19 ఇంకా అంతరించిపోలేదు. అందువల్ల అప్రమత్తంగా ఉంటూ కేసులపై కన్నువేసి ఉంచాలని సంబంధిత అధికారులందరినీ ఆదేశించాం. కొన్ని దేశాల్లో కేసులు మరోసారి పెరుగుతుండడం, కొత్త వేరియంట్లు వస్తుండడం, పండుగలు సమీపిస్తుండడం ఓ సవాల్‌లాంటిది. దేశంలో కరోనా వైరస్‌లో కొత్త రకాలేమైనా ఉన్నాయేమో సకాలంలో గుర్తించడానికి వీలుగా పాజిటివ్‌ నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషించేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం’’ అని మాండవీయ చెప్పారు. దేశ, విదేశాల్లో తాజా పరిస్థితిని, వివిధ విభాగాల సన్నద్ధతను ఉన్నతాధికారులు తొలుత ఆయనకు నివేదించారు. దేశంలో రోజువారీ సగటు కేసులు 158 ఉంటే, ప్రపంచంలో మాత్రం 5.9 లక్షల చొప్పున ఉందని తెలిపారు. చైనాలో కేసుల జోరుకు కారణం ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని బీఎఫ్‌.7 రకమేనని, ఇది అత్యంత వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడుల్లో మాత్రం కొత్త కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని తెలిపారు. ఈ నెల 20న వచ్చిన కొత్త కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల నుంచే 84% ఉన్నాయని చెప్పారు.

ముందస్తు డోసు.. 28% లోపే

దేశంలో అర్హులైన జనాభాలో కేవలం 27-28% మంది ముందస్తు (ప్రికాషన్‌) టీకా తీసుకున్నారని, వీటిని మిగిలినవారు కూడా తీసుకుని మాస్కులు ధరించాలని నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్‌ సూచించారు. ‘ప్రజలు భయపడాల్సిన పనిలేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాల మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పు ఇంతవరకు చేయలేదు. రద్దీ ప్రదేశాల్లో మాస్కుల వాడకాన్ని కొనసాగించాలి’ అని పాల్‌ ఈ సమావేశానంతరం చెప్పారు.

విమానాశ్రయాల్లో మళ్లీ పరీక్షలు

చైనా సహా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారిలో కొందరిని యాదృచ్ఛికంగా ఎంపిక చేసి, వారికి కరోనా ఉందో లేదో తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షించనున్నారు. పరిస్థితిపై కేంద్రం వచ్చేవారంలో మరోసారి సమీక్షించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని