దేశంలోకి కొత్త రకం ఒమిక్రాన్‌

చైనాలో విశ్వరూపం చూపుతున్న బీఎఫ్‌.7 రకానికి చెందిన ఒమిక్రాన్‌ వైరస్‌  భారత్‌లోనూ వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు మూడు నమోదయ్యాయి.

Updated : 22 Dec 2022 07:22 IST

మూడు కేసుల నమోదు

దిల్లీ: చైనాలో విశ్వరూపం చూపుతున్న బీఎఫ్‌.7 రకానికి చెందిన ఒమిక్రాన్‌ వైరస్‌  భారత్‌లోనూ వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు మూడు నమోదయ్యాయి. అక్టోబరులో తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది. తాజాగా గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి వెలుగు చూశాయి. కేసుల్లో గణనీయమైన పెరుగుదల లేనప్పటికీ.. ఇప్పటికే బయటపడ్డ, కొత్త వేరియంట్లపై పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలని నిపుణులు వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే..

గుజరాత్‌కు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ ఈ ఏడాది నవంబరులో అమెరికా నుంచి వడోదరకి వచ్చారు. అమె పరీక్ష చేయించుకోగా.. బీఎఫ్‌.7గా గుర్తించారు. అయితే ఆ మహిళ మూడు డోసుల టీకా తీసుకున్నప్పటికీ ఆమెకు సోకింది. ప్రస్తుతం ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవు. సెప్టెంబరులో విదేశాల నుంచి గుజరాత్‌లోని గోటాకి వచ్చిన మరో వ్యక్తికి ఇదే వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి.

చైనాలో విజృంభణ..

ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌, దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్‌ వంటి నగరాల్లో బీఎఫ్‌.7 రకం ప్రధానంగా వ్యాప్తిలో ఉంది. ఈ వేరియంట్‌ కారణంగానే చైనా వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకపోవడం, వ్యాక్సిన్‌ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వంటివి చైనాలో వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఏమిటీ బీఎఫ్‌.7 వేరియంట్‌..?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.5కు చెందిన ఉపరకమే బీఎఫ్‌.7. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంది. దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా చాలా తక్కువ. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఈ రకానికి ఉంది. చైనాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్‌తోపాటు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్‌ ఇప్పటికే వెలుగు చూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని