Devendra Fadnavis: ముంబయి మహారాష్ట్రదే.. ఎవరి సొత్తూ కాదు: ఫడణవీస్‌

ముమ్మాటికీ ముంబయి నగరం మహారాష్ట్రదే గానీ ఎవరి సొత్తు కాదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో కొందరు కర్ణాటక నేతలు ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండు చేస్తుండడాన్ని బుధవారం శాసనసభ వేదికగా ఆయన తీవ్రంగా ఖండించారు.

Updated : 29 Dec 2022 07:17 IST

ఈనాడు, బెంగళూరు, నాగ్‌పుర్‌ : ముమ్మాటికీ ముంబయి నగరం మహారాష్ట్రదే గానీ ఎవరి సొత్తు కాదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో కొందరు కర్ణాటక నేతలు ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండు చేస్తుండడాన్ని బుధవారం శాసనసభ వేదికగా ఆయన తీవ్రంగా ఖండించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కర్ణాటక నేతలు చేస్తున్న ఆరోపణల్ని ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌ తొలుత ప్రస్తావించారు. కర్ణాటక సీఎం సహా నేతలందరూ మరాఠీల మనోభావాలను దెబ్బతీస్తుంటే మహారాష్ట్ర ప్రభుత్వం దీటుగా స్పందించడం లేదన్నారు. ఫడణవీస్‌ మాట్లాడుతూ- ముంబయి తమదేనంటూ ఎవరైనా ప్రకటనలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కర్ణాటకకు, కేంద్ర హోంమంత్రికి తెలియజేస్తామని చెప్పారు. ఫలానా ప్రాంతం తమదేనంటూ కొత్తగా ఎవరూ చెప్పుకోకూడదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించుకున్న తర్వాత దానికి విరుద్ధంగా కర్ణాటక నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక- మహారాష్ట్ర మధ్య వివాదమే లేదని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. కేంద్రం, కర్ణాటక, మహారాష్ట్రలోని మూడు ఇంజిన్ల భాజపా సర్కారు ఈ వివాదాన్ని సృష్టించి చోద్యం చూస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని