నోట్ల రద్దు నిర్ణయం సరైనదే

పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన నిర్ణయం సరైనదేనని, ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది.

Updated : 03 Jan 2023 07:47 IST

ఆ విధాన నిర్ణయ ప్రక్రియలో లోపమేమీ లేదు

ఆర్‌బీఐతో కేంద్రం 6 నెలలు చర్చించింది

సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

4:1 మెజారిటీతో తీర్పు 

తీర్పుతో విభేదించిన జస్టిస్‌ నాగరత్న

ఈనాడు, దిల్లీ: పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన నిర్ణయం సరైనదేనని, ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. ప్రజలకు కష్టం ఎదురైందనే కారణంతో నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను కొట్టివేయలేమంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో మరో ముగ్గురు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు.


ర్థిక, సామాజిక విధానాల్లో శానసవ్యవస్థకు ఉన్న అధికారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. ఆర్థిక విధానాలపై నిర్ణయించేందుకు తగిన యోగ్యత కోర్టులకు ఉండదు. ఒక నిర్దిష్ట చర్యవల్ల కలిగే ప్రభావమేమిటో చెప్పడం న్యాయస్థానాలకు సాధ్యం కాదు. దానిని నిపుణుల విజ్ఞతకు వదిలిపెట్టడమే సబబు

సుప్రీంకోర్టు ధర్మాసనం


‘‘ప్రజా ప్రతినిధులతో కూడిన పార్లమెంటును ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో విస్మరించడం తగదు. అయితే ప్రభుత్వ ఉద్దేశాలపై మాత్రం ఎలాంటి అనుమానాలూ లేవు. న్యాయ విశ్లేషణ ప్రకారం చూస్తే ఆ నిర్ణయ ప్రక్రియ ఒక్కటే చట్టవిరుద్ధంగా ఉంది తప్పితే దీని వెనుకనున్న ఉద్దేశాలు కాదు.’’

విభిన్న తీర్పులో జస్టిస్‌ నాగరత్న


మర్థించిన వారిలో రాజ్యాంగ ధర్మాసనం సభ్యులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యంలు ఉన్నారు. జస్టిస్‌ బి.వి.నాగరత్న మాత్రం వ్యతిరేకిస్తూ ప్రత్యేక తీర్పు వెలువరించారు. దీంతో 4:1 మెజారిటీతో న్యాయమూర్తుల ఆమోదముద్ర పడినట్లయింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై తమ తీర్పును మెజార్టీ న్యాయమూర్తుల తరఫున జస్టిస్‌ గవాయి చదివి వినిపించారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 26(2) ప్రకారం నోట్ల రద్దుకు ఆర్‌బీఐ కేంద్ర మండలి సిఫార్సు చేయాలి తప్పితే కేంద్ర ప్రభుత్వమే ముందుగా ప్రతిపాదించడానికి వీల్లేదన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందన్న కారణంతో నిర్ణయాన్ని తప్పుబట్టలేమన్నారు. అత్యంత గోప్యంగా, వేగంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలనీ, ఒకవేళ విషయం లీకైతే తలెత్తే పరిణామాలను ఊహించడమూ కష్టమేనని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విషయాలను రహస్యంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యం ఉందని సమర్థించింది.

లక్ష్యాన్ని సాధించారా అనేది అప్రస్తుతం

‘‘ఆర్థిక ప్రాధాన్యమున్న అంశాల్లో జోక్యం చేసుకొనే ముందు అత్యంత సంయమనంతో వ్యవహరించాలి. ఇక్కడ కార్యనిర్వాహక వ్యవస్థ వివేకాన్ని న్యాయవ్యవస్థ తోసిపుచ్చలేదు. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం, ఆర్‌బీఐ మధ్య ఆరు నెలలుగా సంప్రదింపులు జరిగాయి. నల్లధనం, ఉగ్రనిధులు వంటివాటిని నిర్మూలించేందుకు ఒక హేతుబద్ధమైన ఆలోచన ద్వారానే ఈ చర్య తీసుకున్నట్లు మేం భావిస్తున్నాం. ఆ లక్ష్యాలు సాధించారా? లేదా? అన్నది ఇక్కడ అప్రస్తుతం. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 26(2) ప్రకారం ఏ నోట్లనైనా రద్దుచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్రం విస్తృతాధికారాలను ఉపయోగించిందన్న కారణంతో ఈ సెక్షన్‌ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా కొట్టేయలేం. పెద్దనోట్ల రద్దు నోటిఫికేషన్‌లో ఎలాంటి లోపాలూ లేవు. నోట్లను రద్దుచేసే స్వతంత్ర అధికారం ఆర్‌బీఐకి లేదు.  పాతనోట్ల మార్పిడికి ఇచ్చిన 52 రోజుల సమయం సహేతుకం కాదని చెప్పలేం’’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయి పేర్కొన్నారు. గతంలో రెండు సందర్భాల్లో పెద్దనోట్ల రద్దును చట్టం ద్వారా చేసినంతమాత్రాన కేంద్రానికి ఈ అధికారం లేదని చెప్పలేమని స్పష్టంచేశారు. పిటిషనర్ల వాదనను ధర్మాసనం తిరస్కరిస్తోందని ప్రకటించారు. అన్ని వాస్తవాలనూ కేబినెట్‌ పరిగణనలో తీసుకున్న తర్వాతే కేంద్ర నిర్ణయం వెలువడిందని చెప్పారు.

చట్టం ద్వారా చేసి ఉండాల్సింది: జస్టిస్‌ నాగరత్న

పెద్దనోట్ల రద్దు చాలాపెద్ద విషయమని, ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెలువరించజాలదని ఈ కేసులో విరుద్ధమైన తీర్పు ఇచ్చిన జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు. ఆ నిర్ణయం సదుద్దేశంతో, బాగా ఆలోచించి తీసుకున్నదే అయినప్పటికీ దాన్ని చట్టబద్ధంగా, న్యాయప్రాతిపదికగా చేయాలి తప్పితే, ఉద్దేశాల ఆధారంగా కాదని 124 పేజీల తీర్పులో అభిప్రాయపడ్డారు. ‘‘ఒక నిర్దిష్టమైన సీరీస్‌ నోట్లను రద్దు చేయడంతో పోలిస్తే మొత్తం పెద్ద నోట్లను రద్దు చేయాలనుకోవడం చాలా సీరియస్‌ అంశం. దాన్ని చట్టం ద్వారానే చేసి ఉండాల్సింది. గోప్యత ఇమిడిఉంటే ఆర్డినెన్స్‌ ద్వారానైనా చేయాల్సింది. నోట్ల రద్దును కేంద్రమే కోరుకున్నట్లు ఆర్‌బీఐ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆర్‌బీఐ స్వతంత్రంగా ఆలోచించలేదని స్పష్టమవుతోంది. మొత్తం కసరత్తును 24 గంటల్లో పూర్తిచేశారు. పార్లమెంటు ద్వారా చేయాల్సిన పనిని ఒక్క నోటిఫికేషన్‌తో చేశారు’’ అని తప్పుబట్టారు. ఆ నోటిఫికేషన్‌ శాసనవిరుద్ధమైనదని చెప్పారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 26(2)లో పేర్కొన్న ‘ఎనీ సీరీస్‌’కు అర్థం అన్ని నోట్లనూ రద్దుచేసే అధికారమని కాదన్నారు. ఆ సెక్షన్‌ నిర్దిష్టమైన సీరీస్‌ కరెన్సీ నోట్ల రద్దు గురించి మాత్రమే చెబుతోంది తప్పితే మొత్తం నోట్ల గురించి కాదని పేర్కొన్నారు. నోట్లరద్దు ప్రతిపాదన ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు నుంచి మాత్రమే రావాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి ఇప్పటికే ఆరేళ్లు పూర్తయినందున ఇప్పుడు యథాపూర్వ స్థితిని తీసుకురాలేమనీ, కొత్తగా ఉపశమనం కలిగించలేమని పేర్కొన్నారు. ‘రద్దు చేసిన నోట్లలో 98 శాతాన్ని బ్యాంకుల ద్వారా తిరిగి మార్చుకున్నట్లు రికార్డయింది. కొత్తగా రూ.2,000 నోట్లను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వ చర్య ద్వారా ఆశించిన ఫలితం రాలేదని స్పష్టమవుతోంది’ అని జస్టిస్‌ నాగరత్న చెప్పారు. ఆ ప్రయత్నం వెనుక ప్రభుత్వ ఉద్దేశం మాత్రం అభినందనీయమన్నారు.


విచారణ సాగిందిలా..

నవంబరు 8, 2016: ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన

నవంబరు 9, 2016: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

డిసెంబరు 16, 2016: నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటుతో పాటు ఇతర సవాళ్లపై విచారణను అయిదుగురి సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడి

జులై 23, 2017: గత మూడేళ్లలో ఆదాయపన్ను శాఖ జరిపిన విస్తృత సోదాల్లో సుమారు రూ.71,941 కోట్ల లెక్కల్లో చూపని నగదును గుర్తించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

ఆగస్టు 11, 2017: నోట్ల రద్దు సమయంలో అసాధారణ డిపాజిట్లు జరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ.2.8లక్షల కోట్ల నుంచి రూ.4.3లక్షల కోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి అదనంగా వచ్చి చేరినట్లు ప్రకటించింది

ఆగస్టు 25, 2017: రూ.50, రూ.200 విలువ గల కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది

సెప్టెంబరు 28, 2022: పెద్ద నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. నోట్ల రద్దును సవాలు చేసే పిటిషన్లను క్రమంగా పరిశీలిస్తుందని తెలిపింది.

డిసెంబరు 7, 2022: దీనిపై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం ధర్మాసనం.. నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందజేయాలంటూ కేంద్రంతో పాటు ఆర్బీఐని ఆదేశించింది.

జనవరి 2, 2023: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజార్టీతో సమర్థిస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.

దిల్లీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని