దేవభూమిలో ఎందుకీ ప్రకంపనలు?

ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన జోషీమఠ్‌లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తడానికి భౌగోళిక పరిస్థితులతో పాటు మానవ తప్పిదాలూ కారణమేనా? అభివృద్ధి పేరిట చేపడుతూ వస్తున్న పనులే కొంప తవ్వేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.

Published : 08 Jan 2023 04:53 IST

జోషీమఠ్‌లో ప్రతికూల ప్రభావం చూపిస్తున్న అభివృద్ధి పనులు
ఈనాడు-దిల్లీ, ఇంటర్నెట్‌ డెస్క్‌

ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన జోషీమఠ్‌లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తడానికి భౌగోళిక పరిస్థితులతో పాటు మానవ తప్పిదాలూ కారణమేనా? అభివృద్ధి పేరిట చేపడుతూ వస్తున్న పనులే కొంప తవ్వేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, హేమ్‌కుండ్‌లకు భక్తుల రాకపోకలు పెరగడంతో జోషీమఠ్‌లో పర్యాటక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. హోటళ్ల నిర్మాణం పెరిగిపోయింది. పర్యాటకుల కోసం రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు భారీ యంత్రాలు ఇక్కడ నిరంతరం పనిచేయాల్సి వస్తోంది. వీటి కారణంగా పెరిగిన ఒత్తిడి అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీసి కొత్త ఉపద్రవాన్ని తీసుకొచ్చినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జోషీమఠ్‌కు సమీపంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న విద్యుత్తు ప్రాజెక్టు కోసం భారీ సొరంగమార్గం తవ్వడానికి పెద్దఎత్తున పేలుళ్లు చేపట్టడంతో వాటి ధాటికి భూమి కంపించి, ఇప్పుడు భూకంపం తరహాలో పగుళ్లు సంభవించినట్లు గట్టిగా చెబుతున్నారు. ఏళ్లతరబడి చేపట్టిన కార్యకలాపాల కారణంగా ఒకవైపు కొండచరియలు విరిగిపడుతుంటే, మరోవైపు మానవ కార్యకలాపాలు పెరగడం కొత్త ప్రమాదాలకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు.

పురాతన శిలలపై నిర్మాణం

జోషీమఠ్‌కు ప్రమాదం పొంచి ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు. ఈ పట్టణం పురాతనమైన శిలలపై నిర్మితమై ఉందని, పైగా భూగర్భంలో జల ప్రవాహం వల్ల నేల సామర్థ్యం క్షీణిస్తే.. కుంగిపోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. విష్ణుప్రయాగ నుంచి వస్తున్న నదీ ప్రవాహాల ప్రభావం కూడా జోషీమఠ్‌పై పడుతోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ‘వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ’కి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఓ పరిశోధన చేశారు. ఇక్కడి భూగర్భంలో పెద్దపెద్ద రాళ్లతోపాటు, గ్నిసిక్‌ శిలలు ఉన్నట్లు తేల్చారు. ఇవి అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. వర్షాకాలంలో ఈ రాళ్లమధ్య తీవ్ర ఒత్తిడి ఏర్పడి భూగర్భ పొరల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు చెప్పారు.

నష్టాన్ని నివారించాలంటే..!

జోషీమఠ్‌లో నష్టాన్ని నివారించాలంటే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని నిపుణులు చెబుతున్నారు.జోషీమఠ్‌లో పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్న కార్యకలాపాలను తక్షణం నిలుపు చేయించాలని కోరారు.

జోషీమఠ్‌ ప్రాధాన్యం ఇదీ

జోషీమఠ్‌.. ఉత్తరాఖండ్‌లోని హిమాలయా సానువుల్లో ఓ చిన్న పట్టణం. బద్రీనాథ్‌ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుడిని ఇక్కడికే తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సైనికులకు, హిమాలయ యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఇదే బేస్‌ క్యాంప్‌. బద్రీనాథ్‌ సందర్శనకు వెళ్లే భక్తుల్లో చాలామంది రాత్రి ఇక్కడే బస చేస్తారు. భారత సైనిక దళాలకు ఇదో వ్యూహాత్మక పట్టణం. ధౌలిగంగా, అలకానంద నదుల సంగమ స్థానమైన విష్ణుప్రయాగకు చేరువలో ఉంటుంది. ఆది శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో జోషీమఠ్‌ (జ్యోతిర్‌మఠ్‌) ఒకటి. ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది.


1976లోనే హెచ్చరించినా చర్యలు శూన్యం

ప్రభుత్వం నియమించిన మిశ్ర కమిటీ 1976లోనే హెచ్చరికలు జారీచేసినప్పటికీ వాటిని లెక్కచేయకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతూ రావడం ప్రస్తుత విపత్తుకు దారితీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా లేని డ్రైనేజీ వ్యవస్థ- నీటి సహజ గమనాన్ని అడ్డుకుంటోందన్న వాదన ఉంది. చమోలీ జిల్లాలోని తపోవన్‌ విష్ణుగఢ్‌ వద్ద 510 మెగావాట్ల ఎన్టీపీసీ జల విద్యుత్తు కేంద్ర నిర్మాణంవల్లే భూమిలో పగుళ్లు వచ్చాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. దానిపై హెచ్చరికల్ని ప్రభుత్వం బేఖాతరు చేసిందని వారు మండిపడుతున్నారు. దీనివల్ల పురాతన ఆలయాల గోడల్లో నెర్రెలు ఏర్పడ్డాయి. ఎన్‌హెచ్‌-58లో పెద్దపెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. అక్కడినుంచి ప్రజలందరినీ తరలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ శనివారం ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని