విల్లు చెదిరింది.. విధి మారింది: చాయ్‌ అమ్ముతున్న జాతీయ ఆర్చర్‌

విల్లు ఎక్కుపెడితే అర్జునుడిలా ‘పక్షి కన్ను’ కనిపించడం లేదు ఈమెకు. చక్కటి ధనుర్విద్యా నైపుణ్యం ఉన్నా.. ఆ కంటికి తమ కుటుంబాన్ని పీడిస్తున్న భయంకరమైన పేదరికమే కనిపించింది.

Updated : 08 Jan 2023 08:29 IST

లోహర్‌దగా (ఝార్ఖండ్‌): విల్లు ఎక్కుపెడితే అర్జునుడిలా ‘పక్షి కన్ను’ కనిపించడం లేదు ఈమెకు. చక్కటి ధనుర్విద్యా నైపుణ్యం ఉన్నా.. ఆ కంటికి తమ కుటుంబాన్ని పీడిస్తున్న భయంకరమైన పేదరికమే కనిపించింది. దీనికితోడు ప్రపంచకప్‌ పోటీలకు ఎంపికయ్యే దశలో దురదృష్టం వెక్కిరించింది. ఇంకేముందీ.. దేశానికి బంగారు పతకాలు తెచ్చి పెట్టాల్సిన చేతులు ఝార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీలోని అరగోడా చౌక్‌లో చాయ్‌ అమ్ముతున్నాయి. జాతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందిన దీప్తికుమారి కలలన్నీ రాంచీ వీధుల్లో ఇలా చెదిరిపోయాయి.

రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో పలు పతకాలు తెచ్చిన ఈ విలువిద్యా క్రీడాకారిణి దుస్థితిని పట్టించుకునే నాథుడు లేడు. లోహర్‌దగా జిల్లాకు చెందిన నిరుపేద రైతు బజరంగ్‌ ప్రజాపతి తన కుమార్తె దీప్తి నైపుణ్యాన్ని గుర్తించి అప్పులు చేసి మరీ ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా ఖర్‌సావా శిక్షణ కేంద్రానికి ఆమెను పంపారు. అక్కడ పరిచయమైన అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి దీపిక.. దీప్తి నైపుణ్యాన్ని మెచ్చి ఆమెను మరింత ప్రోత్సహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పలు విజయాలు సాధించిన దీప్తికుమారికి అసలైన ఎదురుదెబ్బ 2013 ప్రపంచకప్‌ పోటీల ఎంపికల సందర్భంగా తగిలింది.

కోల్‌కతా శిబిరానికి వెళ్లిన ఆమె.. అక్కడ ఎంపికై ఉంటే అంతర్జాతీయ ఆర్చర్‌ కావాలన్న తన కల ఈ పాటికి నెరవేరేది. రూ.4.5 లక్షల విలువ చేసే ఆమె విల్లును ఆ కేంద్రంలోని ఎవరో విరిచేశారు. దీప్తి జీవితాన్ని మలుపు తిప్పే ఆ దశలో విరిగింది విల్లు కాదు.. ఆమె హృదయం. తీవ్రమైన నిరాశతో లోహర్‌దగాకు తిరిగి వచ్చిన దీప్తి మళ్లీ కోలుకోలేదు. ప్రతిభావంతురాలైన ఓ క్రీడాకారిణి ప్రభ అంతటితో ఆగిపోకుండా ఎవరూ చేయూతనూ అందించలేదు. తన శిక్షణ కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు ఇప్పుడామె చాయ్‌ అమ్ముతోంది. తండ్రి ఎప్పటిలా సేద్యం చేస్తుండగా, తమ్ముడు అభిమన్యు ఆటో నడుపుతున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు