‘అమ్మ’ ఆశలను నిలిపిన వైద్యులు.. ఒక శిశువు మృతిచెందిన 52 రోజులకు మరో బిడ్డకు జననం

కృత్రిమ పద్ధతుల్లో గర్భం దాల్చిన మహిళకు కవలల ప్రసవంలో ఎదురైన సమస్యను వైద్యులు పరిష్కరించారు. ఒడిశాలోని కటక్‌ జిల్లా కెందుపాట్నాకు చెందిన పార్వతి బెవురా కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చారు.

Published : 09 Jan 2023 09:13 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: కృత్రిమ పద్ధతుల్లో గర్భం దాల్చిన మహిళకు కవలల ప్రసవంలో ఎదురైన సమస్యను వైద్యులు పరిష్కరించారు. ఒడిశాలోని కటక్‌ జిల్లా కెందుపాట్నాకు చెందిన పార్వతి బెవురా కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చారు. నొప్పులు రావడంతో గతేడాది అక్టోబరులో కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు కవలల్లో ఒక శిశువు మృతి చెందడంతో తొలగించారు.

రెండో శిశువుకు ప్రసవం చేస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుందని భావించిన డాక్టర్లు.. ప్రసవం చేయకుండా బిడ్డను తల్లి కడుపులోనే ఉంచి బరువు పెరిగిన తరువాత డెలివరీ చేయాలని నిర్ణయించారు. పార్వతి మధుమేహం, థైరాయిడ్‌ వంటి సమస్యలతో బాధపడుతుండటంతో 52 రోజులపాటు తల్లీబిడ్డను 24 గంటలూ పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందించారు.

అనంతరం డిసెంబరు 19న ప్రసవం చేయగా మగ శిశువుకు పార్వతి జన్మనిచ్చింది. 1370 గ్రాముల బరువుతో శిశువు జన్మించడంతో కొన్నిరోజులపాటు చిన్న పిల్లల వార్డులో ఉంచి పర్యవేక్షించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇన్ని అడ్డంకులు ఎదురైనా సాధారణ ప్రసవం చేయడం ఆనందం కలిగించిందన్న వైద్యులు.. రాష్ట్రంలో ఇలాంటి కేసు ఇదే తొలిసారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని