Vande Bharat Express: బెర్తులు ఉండే వందేభారత్‌ల వేగం 200 కి.మీ.

బెర్తులు ఉండే వందేభారత్‌ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా పట్టాలపై అవి 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.

Updated : 20 Jan 2023 07:30 IST

దిల్లీ: బెర్తులు ఉండే వందేభారత్‌ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా పట్టాలపై అవి 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయని అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. సీట్లు మాత్రమే (ఛైర్‌కార్‌) ఉండే వందేభారత్‌లు- శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని వివరించాయి. బెర్తులు ఉండే రైళ్లు- రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు బదులుగా అందుబాటులోకి వస్తాయని తెలిపాయి. ఇది దశలవారీగా జరుగుతుంది. 400 వందేభారత్‌ రైళ్ల కోసం రైల్వేశాఖ టెండర్లు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి పనులు ఖరారు కానున్నాయి. ఈ రైళ్ల ఉత్పత్తికి నాలుగు దేశీయ దిగ్గజ కంపెనీలు, పలు విదేశీ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయి. మొదటి 200 రైళ్లలో సీట్లు మాత్రమే ఉంటాయి. అవి 180 కి.మీ. వేగం వరకు అందుకోగలవు. ఉక్కుతో తయారయ్యే ఈ రైళ్లను భద్రతపరమైన కారణాలతో 130 కి.మీ. వేగానికే పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. రెండోదశలో వచ్చే 200 రైళ్లను ఉక్కుకు బదులు అల్యూమినియంతో తయారు చేసి, బెర్తులు అమరుస్తారు. ఇవి 200 కి.మీ. వేగంతో వెళ్లేందుకు వీలుగా దిల్లీ-ముంబయి, దిల్లీ-కోల్‌కతా మార్గాల్లో తగిన మార్పులు చేయడంతో పాటు కంచె వేసే పనులు చేపడుతున్నామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నివారించే సాంకేతిక ఏర్పాట్లను రూ.1,800 కోట్ల వ్యయంతో ఈ రెండు మార్గాల్లో చేపడుతున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని