US: మనోళ్లకు కొలువుల కలవరం
అమెజాన్‌లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు. ఇటీవల లేఆఫ్‌లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం సమాచారమిచ్చింది.
అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు
పెద్దఎత్తున లేఆఫ్‌లు ప్రకటించిన ఐటీ సంస్థలు
ప్రవాసుల మెడపై కత్తిలా హెచ్-1బీ వీసా నిబంధనలు
తీవ్ర ఆందోళనలో వేల కుటుంబాలు
అమెజాన్‌లో పనిచేస్తున్న గీత(పేరు మార్చాం) మూడు నెలల క్రితమే అమెరికాకు వెళ్లారు. ఇటీవల లేఆఫ్‌లో భాగంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం సమాచారమిచ్చింది. మార్చి 20 ఆమె చివరి పనిదినం అని తెలిపింది. హెచ్-1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లిన ఆమె.. ఇప్పుడు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిందే. లేదంటే స్వదేశానికి తిరిగివెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
హెచ్-1బీ వీసాతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్న సీత(పేరు మార్చాం) ఈ నెల 18న లేఆఫ్‌కు గురైంది. ఆమె ఒంటరి తల్లి. తన కుమారుడు త్వరలోనే కళాశాలలో చేరబోతున్నాడు. ఈ సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది.
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం.. ఆరంకెల జీతం.. అందమైన జీవితం.. ఇప్పటిదాకా భారతీయులు అనుభవిస్తున్న సౌకర్యం ఇది. ..కానీ ఇప్పుడు పరిస్థితి తల్లకిందులవుతోంది. రాత్రికిరాత్రే కొలువులు ఊడుతున్నాయి. బాస్ ఎప్పుడు తనను ఉద్యోగం నుంచి తొలగిస్తాడో అన్న బెంగ వీరిని వెంటాడుతోంది. ఆర్థికమాంద్యం బూచి చూపి బడా ఐటీ కంపెనీలు లే ఆఫ్‌లు అంటూ పెద్దఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇలా కొలువులు కోల్పోయిన మనవాళ్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు హెచ్-1బీ వీసా నిబంధనల కత్తి వీరి మెడపై వేలాడుతోంది. 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేదా స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలన్న నిబంధన ప్రవాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగం దొరక్క.. ఓ వైపు సతమతమవుతుంటే.. ఈ రెండు నెలల గడువు మరింత కుంగదీస్తోంది. మరో ఉద్యోగం దొరక్కపోతే తమ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, పిల్లల చదువులకు అడ్డంకులు ఎదురవుతాయని వారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో తెలుగువారూ ఉన్నారు.
కొలువు కోల్పోయినవారిలో భారతీయులు 40 శాతం
ఇటీవల కొన్ని నెలలుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్‌బుక్ సహా పలు సంస్థలు వరుసబెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి వేళ వ్యయభారాన్ని తగ్గించుకోవడానికి కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని పేర్కొంటున్నాయి. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నవారిలో భారతీయులు అధికంగా ఉన్నారు. దీంతో ఉద్యోగాల కోతల ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉంది. అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో గత నవంబరు నుంచి సుమారు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులే అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో అత్యధికులు హెచ్-1బీ, ఎల్1 వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారే. ఈ వీసా నిబంధనల ప్రకారం 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగంలో చేరితే సరి. లేకపోతే గడువు ముగిసిన 10 రోజుల్లోపు దేశాన్ని వీడాలి. దీంతో కొలువు కోల్పోయినవారంతా ఎలాగైనా అగ్రరాజ్యంలో ఉండేందుకు మరో ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఉద్యోగావకాశాల గురించి ఆరా తీస్తున్నారు. వీరికి ప్రవాస భారతీయ సంఘాలు సహకారం అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దాదాపు అన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ఇంత తక్కువ వ్యవధిలో మరో ఉద్యోగం సాధించడం చాలా కష్టంగా ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు.
హెచ్1-బీ వీసాదారులకు మినహాయింపు ఇవ్వాలి
అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెరికా వీసా విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ సంస్థ యజమాని అజయ్ జైన్ భుటోరియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉద్యోగావకాశాల విషయంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐటీ సంస్థలు హెచ్1-బీ ఉద్యోగుల తొలగింపు తేదీని మరికొన్ని నెలలు పొడిగించాలని ఆయన సూచించారు. ‘‘వేల మంది ఐటీ ఉద్యోగులు లేఆఫ్‌లను ఎదుర్కోవడం దురదృష్టకరం. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. లేదంటే దేశాన్ని వీడాలి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబాలపై పెను ప్రభావం పడుతోంది. పిల్లల చదువులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. భారీ స్థాయిలో పన్నులు చెల్లిస్తూ అమెరికా అభివృద్ధికి కీలకంగా మారిన హెచ్-1బీ వీసాదారులకు టెక్ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుంది. వారి ఉద్యోగాల తొలగింపు తేదీని మరికొన్ని నెలలు పొడిగించాలి’’ అని అజయ్ జైన్ పేర్కొన్నారు.
కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి: కేజ్రీవాల్
అమెరికాతోపాటు దేశంలోనూ ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తుండటంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తగినచర్యలు తీసుకోవాలని సూచించారు.
మొత్తంగా ఐటీ రంగంలో గత నెలరోజుల్లోనే సుమారు 50వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
-
India News
Population Census: లోక్‌సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!