తరగని స్ఫూర్తి.. నేతాజీ

దేశ స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ పాత్ర వెలుగులోకి రాకూడదనే ప్రయత్నాలు గతంలో జరిగాయని, వలసవాద పాలకులపై ధైర్యసాహసాలతో ఆయన చేసిన పోరును దేశం మాత్రం ఎన్నటికీ మరిచిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Published : 24 Jan 2023 04:57 IST

వలస పాలకులపై బోస్‌ పోరు అజరామరం  
ఘనంగా నివాళులర్పించిన ప్రధాని మోదీ

పోర్ట్‌బ్లెయిర్‌, దిల్లీ, కోల్‌కతా: దేశ స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ పాత్ర వెలుగులోకి రాకూడదనే ప్రయత్నాలు గతంలో జరిగాయని, వలసవాద పాలకులపై ధైర్యసాహసాలతో ఆయన చేసిన పోరును దేశం మాత్రం ఎన్నటికీ మరిచిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. బోస్‌కు సంబంధించిన దస్త్రాలను బహిర్గతం చేయాలనే డిమాండ్లు అనేక ఏళ్లుగా ఉన్నా తమ ప్రభుత్వం ఆ పని చేసి చూపించిందని తెలిపారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో నిర్మించబోయే సుభాష్‌ చంద్రబోస్‌ జాతీయ స్మారకం నమూనాను నేతాజీ 126వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ స్మారక చిహ్నం ప్రజల హృదయాల్లో దేశభక్తి భావాలను, స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు.

21 దీవులకు పరమ్‌వీర్‌చక్ర గ్రహీతల పేర్లు

అండమాన్‌లోని 21 దీవులకు పరమ్‌వీర్‌చక్ర గ్రహీతల పేర్లు పెడుతున్నట్లు ప్రధాని ప్రకటించారు. దేశంలో త్రివర్ణ పతాకం తొలుత అండమాన్‌లోనే రెపరెపలాడిందని గుర్తుచేశారు. అండమాన్‌ దీవుల్లో పేరులేని పెద్ద దీవికి మొదటి పరమ్‌వీర్‌చక్ర గ్రహీత మేజర్‌ సోమ్‌నాథ్‌ శర్మ పేరు పెడుతున్నట్లు చెప్పారు. ‘నిజ జీవిత హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పేర్లు లేని 21 దీవులకు పరమ్‌ వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు పెట్టాలని దానికి అనుగుణంగానే నిర్ణయించారు’ అని పీఎంవో వెల్లడించింది. రాస్‌ ఐలాండ్స్‌కు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ద్వీప్‌గా 2018లో పేరుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడే ఇప్పుడు జాతీయ స్మారకాన్ని నిర్మించనున్నారు. దీనిలో కేబుల్‌ కార్‌ రోప్‌వే, లేజర్‌ సౌండ్‌ షో, అమ్యూజ్‌మెంట్‌ పార్కువంటివి ఉంటాయని ఓ అధికారి తెలిపారు.

ప్రచారం కోసం పాకులాట: మమత

అండమాన్‌ దీవులకు పేర్లు పెట్టడం ప్రచార పాకులాట అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో విమర్శించారు. ఆ దీవులకు శాహీద్‌, స్వరాజ్‌ద్వీప్‌ అనే పేర్లను స్వయంగా బోస్‌ ఇచ్చారని గుర్తుచేశారు. ‘దేశ భవిత కోసం ప్రణాళిక సంఘాన్ని బోస్‌ ఏర్పాటు చేయించారు. అదిప్పుడు లేదు. ఎందుకు అలా చేశారో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి.. ఎందుకంటే నేను అంత తెలివైనదాన్ని కాదు’ అని వ్యంగ్యంగా అన్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని