ఆ ప్రతిపాదిత సవరణ మీడియా స్వేచ్ఛకు ముప్పు: ఎన్‌బీడీఏ

మీడియా ప్రచురించే ఏదైనా ఒక వార్తను పీఐబీ నిజనిర్ధారణ విభాగం లేదా ప్రభుత్వానికి చెందిన మరే అధీకృత సంస్థ ‘ఫేక్‌న్యూస్‌’ అని చెబితే దాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాల్సిందేనంటూ ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ప్రతిపాదించిన సవరణపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీడీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.

Published : 24 Jan 2023 04:50 IST

దిల్లీ: మీడియా ప్రచురించే ఏదైనా ఒక వార్తను పీఐబీ నిజనిర్ధారణ విభాగం లేదా ప్రభుత్వానికి చెందిన మరే అధీకృత సంస్థ ‘ఫేక్‌న్యూస్‌’ అని చెబితే దాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాల్సిందేనంటూ ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ప్రతిపాదించిన సవరణపై న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీడీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రతిపాదిత సవరణ మీడియా వాక్‌ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌బీడీఏ ప్రధాన కార్యదర్శి అన్నీ జోసెఫ్‌ ప్రకటన విడుదల చేశారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌) రూల్స్‌, 2021కు సవరణల్ని ప్రతిపాదిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఈ నెల 17న సవరణ ముసాయిదాను జారీ చేసింది. ఈ సవరణలను ఎన్‌బీడీఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రతిపాదిత సవరణతో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ ప్రచురితమయ్యే కథనాలను ‘నిజనిర్ధారణ’ పేరుతో ఆన్‌లైన్‌ నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఎన్‌బీడీఏ పేర్కొంది. ఎలాంటి పరిశీలన లేకుండానే డిజిటల్‌ వార్తల కంటెంట్‌ను నియంత్రించేలా పీఐబీకి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడమంటే.. మీడియా గొంతు నొక్కడమేనని అభివర్ణించింది. వార్తా ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు ఇప్పటికే తగినన్ని చట్టాలు, నిబంధనలు, చట్టబద్ధమైన సంస్థలు ఉన్నాయని ఎన్‌బీడీఏ గుర్తు చేసింది.  ఈ సవరణను ఉపసంహరించుకోవాలని ఎన్‌బీడీఏ విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని