రహస్య నివేదికల వెల్లడి తీవ్రమైన అంశం

న్యాయమూర్తులుగా ప్రతిపాదించిన వ్యక్తులపై నిఘా వర్గాలు(ఐబీ, రా) అందించిన నివేదికలను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల వెబ్‌సైట్‌ ద్వారా బహిర్గతపరచడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తొలిసారి స్పందించారు.

Published : 25 Jan 2023 03:25 IST

సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానాలపై కిరణ్‌ రిజిజు

దిల్లీ: న్యాయమూర్తులుగా ప్రతిపాదించిన వ్యక్తులపై నిఘా వర్గాలు(ఐబీ, రా) అందించిన నివేదికలను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల వెబ్‌సైట్‌ ద్వారా బహిర్గతపరచడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తొలిసారి స్పందించారు. రహస్యంగా నిక్షిప్తపరచాల్సిన సమాచారాన్ని బహిర్గతం చేయడం తీవ్రమైన అంశమని తెలిపారు. ఇది పెను ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు. కొందరు న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా నియమించడానికి సంబంధించి కొలీజియం గతంలో చేసిన సిఫార్సులను పునరుద్ఘాటిస్తూ...వారిపై నిఘా వర్గాలు వ్యక్తంచేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ మంగళవారం దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విలేకరులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి కిరణ్‌ రిజిజు జవాబిచ్చారు. ‘నిఘా విభాగాల రహస్య నివేదికలను వెల్లడించడం తీవ్రమైన విషయం. అయితే, దీనిపై సరైన సమయంలో స్పందిస్తా’ అని కిరణ్‌ రిజిజు అన్నారు. కీలక సమాచారం వెల్లడిపై భారత ప్రధాన న్యాయమూర్తితో ఏమైనా మాట్లాడతారా అని అడగ్గా.......‘ఆయన న్యాయ వ్యవస్థ అధినేత. నేను ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వారధి లాంటి వాణ్ని. మేం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. తరచూ కలుస్తుంటాం’ అని కేంద్ర న్యాయమంత్రి అన్నారు. జడ్జీల నియామకం పాలనాపరమైన అంశమని, వ్యాజ్యాలపై తీర్పులివ్వడం ఇందుకు పూర్తిగా భిన్నమైనదని రిజిజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని