సంక్షిప్త వార్తలు (12)

యావజ్జీవ ఖైదును అనుభవిస్తున్న దోషి తనను శిక్షాకాలం ముగియక ముందే జైలు నుంచి విడుదల చేయాలని అభ్యర్థిస్తే అప్పటికి అమలులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్నే వర్తింపజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 25 Jan 2023 05:55 IST

దోషుల ముందస్తు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వ విధానమే కీలకం
సుప్రీంకోర్టు రూలింగ్‌
 

దిల్లీ: యావజ్జీవ ఖైదును అనుభవిస్తున్న దోషి తనను శిక్షాకాలం ముగియక ముందే జైలు నుంచి విడుదల చేయాలని అభ్యర్థిస్తే అప్పటికి అమలులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్నే వర్తింపజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్‌కు చెందిన ఓ ఖైదీ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు రూలింగ్‌ ఇచ్చింది. డబ్బు వివాదంలో ఓ వ్యక్తిని హత్య చేసిన హితేశ్‌ అలియాస్‌ శివశంకర్‌ దవేకు న్యాయస్థానం 2002లో జీవితకాల జైలు శిక్ష విధించింది. తాను 15 ఏళ్లుగా జైలులో ఉంటున్నానని, సడలింపు వ్యవధితో కలిపితే 19 ఏళ్ల సమయాన్ని పూర్తి చేసినందున విడుదల చేయాలని కోరుతూ గుజరాత్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పలు కారణాలను పేర్కొంటూ ఆ పిటిషన్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ హితేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


17 మంది మైనారిటీల హత్య కేసు.. 22 మంది నిందితులూ నిర్దోషులే
ఆధారాలు లేవంటూ గుజరాత్‌ కోర్టు తీర్పు

గోద్రా: గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సందర్భంగా ఇద్దరు చిన్నారులు సహా 17 మంది మైనారిటీలను హతమార్చిన కేసులో మొత్తం 22 మంది నిందితులనూ  పంచమహల్‌ జిల్లాలోని హలోల్‌ టౌన్‌ కోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులను దోషులుగా గుర్తించేందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి హర్ష్‌ త్రివేది వారిని విడుదల చేస్తూ తీర్పిచ్చినట్లు డిఫెన్స్‌ న్యాయవాది గోపాల్‌సిన్హ సోలంకీ వెల్లడించారు. కాగా నిందితుల్లో ఎనిమిది మంది ఇప్పటికే మరణించారు. డెలొల్‌ గ్రామంలో ఫిబ్రవరి 28, 2002లో 17 మంది మైనారిటీలు హత్యకు గురయ్యారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా వారి భౌతికకాయాలను నిందితులు తగలబెట్టేశారు. ఫిబ్రవరి 27, 2002లో గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను కొందరు దుండగులు తగులబెట్టిన ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అయోధ్య నుంచి తిరిగివస్తున్న కరసేవకులు అత్యధికులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మతకలహాలు చెలరేగాయి.


‘భారోస్‌’తో కేంద్రమంత్రుల తొలి వీడియోకాల్‌

దిల్లీ: ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు భారత్‌ మొదలుపెట్టిన కసరత్తులకు కీలక ముందడుగు పడింది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో ఐఐటీ మద్రాస్‌ తొలి స్వదేశీ మొబైల్‌ ఓఎస్‌ను రూపొందించింది. ‘భారోస్‌’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్‌, అశ్వినీ వైష్ణవ్‌లు మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం దీన్ని మంత్రులు విజయవంతంగా పరీక్షించారు. ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే మొబైల్‌ నుంచి కేంద్రమంత్రులు.. ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు.


చీరకట్టులో కోట ఎక్కిన చిన్నారులు

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సాహసయాత్రలకు సై అంటున్నారు. చీరకట్టులో ప్రమాదకరమైన జీవధాన్‌ కోటను ఎక్కారు. వీరే ఠాణెకు చెందిన హరిత(13), గృహిత(8). కోట ఎక్కిన అతి పిన్నవయస్కురాలిగా గృహిత రికార్డ్‌ సొంతం చేసుకుంది. వీరిద్దరూ తన తండ్రి సచిన్‌ విచారే ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. తమ తండ్రితో కలిసి మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్కేందుకు వారిద్దరూ సిద్దమయ్యారు. అయితే.. 3,800 అడుగుల ఎత్తులో హరితకు ఆరోగ్యం దెబ్బతినగా.. తను వెనుదిరిగింది. దీంతో గృహిత, ఆమె తండ్రి సచిన్‌లు దిగ్విజయంగా ఎవరెస్ట్‌ను అధిరోహించారు. దీంతో మహారాష్ట్ర నుంచి ఎవరెస్ట్‌ ఎక్కిన పిన్నవయస్కురాలిగా కూడా గృహిత నిలిచింది.


వాస్తుశిల్పి, పద్మభూషణ్‌ బి.వి.దోషీ కన్నుమూత

అహ్మదాబాద్‌: ఆధునిక భారతదేశంలో అగ్రశ్రేణి వాస్తుశిల్పిగా పేరొందిన బాలకృష్ణ్‌ విట్ఠల్‌దాస్‌ దోషీ (95) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘దోషీ జీ గొప్ప వాస్తుశిల్పి. ఆయన కృషితో దేశవ్యాప్తంగా వెలసిన అద్భుత నిర్మాణాలను భావి తరాలు కూడా చూడవచ్చు’’ అని ప్రధాని మోదీ తన సంతాప సందేశంలో నివాళులు అర్పించారు. 1927లో పుణెలో జన్మించిన దోషీ ఆర్కిటెక్టుగా ఎదిగి, ఎంతోమంది దిగ్గజాలతో కలిసి పనిచేశారు. 2018లో ప్రతిష్ఠాత్మక ప్రిట్జ్‌కర్‌ బహుమతి, 2020లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మభూషణ్‌’, 2022లో ‘రాయల్‌ గోల్డ్‌మెడల్‌’ (లండన్‌) అందుకొన్నారు. ‘‘దోషీ జీ ఆర్కిటెక్ట్‌ రంగంలో ధ్రువతార’’ అని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ నివాళులు అర్పించారు.


ముంబయిలో కరోనా కేసు నమోదు కాలేదోచ్‌
మూడేళ్లలో ఇదే తొలిసారి

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో మూడేళ్లలో తొలిసారిగా మంగళవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు ఒక్క మరణం కూడా సంభవించలేదని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు పేర్కొన్నారు. దేశంలో 2020 మార్చిలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఇలా రోజువారీ కేసు నమోదు కాకపోవడం ఇదే మొదటిసారని వెల్లడించారు. అయితే సోమవారం ముంబయిలో నాలుగు కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. 2022 నవంబరు నుంచి ఇక్కడ రోజువారీ కేసుల సంఖ్య తగ్గుదల మొదలైందని తెలిపారు. గతేడాది జనవరి 6న అత్యధికంగా 20,971 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.


‘పరీక్షా పే చర్చా’కు విద్యార్థుల అమితాసక్తి
పేర్లు నమోదు చేసుకున్న 38 లక్షల మంది

దిల్లీ: విద్యార్థులతో ప్రధాని మోదీ సంభాషించే ‘పరీక్షా పే చర్చా’లో పాల్గొనడానికి రికార్డు స్థాయిలో 38 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంగళవారం వెల్లడించారు. గతేడాది సంఖ్య కంటే ఇది కనీసం 15 లక్షలు అధికమని తెలిపారు. ‘పరీక్షా పే చర్చా’కు 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్‌లు రావడం విశేషం. దిల్లీలోని తాల్‌కటోరా ఇండోర్‌ స్టేడియంలో జనవరి 27వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో నేరుగా పాల్గొనేందుకు సుమారు 2400 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి అందిన 20లక్షల ప్రశ్నలను వడపోసి ఎన్‌సీఈఆర్‌టీ కొన్నింటిని ఎంపిక చేసింది. వీటిని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.


ఎయిరిండియాకు రూ.10 లక్షల జరిమానా

దిల్లీ: పారిస్‌-దిల్లీ విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించిన ప్రయాణికుల వివరాలు ఇవ్వనందుకు ఎయిరిండియా సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) రూ.10 లక్షల అపరాధ రుసుము విధించింది. విమానాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలను తమకు సకాలంలో తెలియజేయలేదని డీజీసీఏ మంగళవారం ఓ ప్రకటనలో తప్పుపట్టింది. డిసెంబర్‌ 6న పారిస్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎఐ-142 విమానంలో మద్యం తాగి ప్రయాణికుల్లో ఒకరు శౌచాలయంలో సిగరెట్‌ కాల్చి నిబంధనలను అతిక్రమించారు. మరో ఘటనలో మహిళా ప్రయాణికురాలు శౌచాలయానికి వెళ్లినప్పుడు ఒక ప్రయాణికుడు ఆమె సీటుపై పడుకున్నాడన్నది ఇంకో అభియోగం. ఎయిరిండియా సంస్థపై ఇలా చర్యలు తీసుకోవడం వారం రోజుల్లోనే ఇది రెండోసారి.


నేడు మోదీతో ఈజిప్టు అధ్యక్షుడి భేటీ

దిల్లీ: గణతంత్ర వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా భారత్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌-సిసీ మంగళవారం వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనతో ప్రధాని మోదీ భేటి కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ డొమైన్‌, వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపనున్నారు.


బద్రీనాథ్‌ హైవేపై పగుళ్లు.. యాత్రికుల్లో ఆందోళన
ఏప్రిల్‌లో మొదలుకానున్న చార్‌ధాం యాత్ర

గోపేశ్వర్‌ (ఉత్తరాఖండ్‌): జోషీమఠ్‌లో ఆందోళనకరంగా మారిన మట్టి కుంగుబాటు బద్రీనాథ్‌ హైవేపైనా పగుళ్లకు దారితీయడం యాత్రికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలతో కూడిన చార్‌ధాం యాత్ర మరో నాలుగు నెలల్లో మొదలుకానుంది. ఈ జాతీయ రహదారిలో టీసీపీ ప్రాంతం నుంచి మార్వాడీ వంతెన వరకు కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువ. ఇటీవల మట్టి జారడం మొదలయ్యాక ఈ మార్గం పలుచోట్ల కుంగుతోంది. బైపాస్‌ రహదారిలోని సింగ్‌ధర్‌ వార్డు, నార్సింగ్‌ ఆలయానికి వెళ్లే మోటార్‌ వే, గోరంగ్‌, మార్వాడీ ప్రాంతాల్లో హైవే క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఏటా ఏప్రిల్‌ - మే నెలల్లో మొదలయ్యే చార్‌ధాం యాత్ర సందర్భంగా ఈ హైవే భారీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతుంది.


స్పీకర్‌ కార్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేం
బాబూలాల్‌ మరాండీ పిటిషన్‌ను కొట్టేసిన ఝార్ఖండ్‌ హైకోర్టు

రాంచీ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద శాసనసభలో తనపై జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను సవాలుచేస్తూ ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, భాజపా నాయకుడు బాబూలాల్‌ మరాండీ వేసిన పిటషన్‌ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. స్పీకర్‌ కార్యాలయం స్వతంత్రమైనదని,  ఈ దశలో న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేయలేదని జస్టిస్‌ రాజేష్‌శంకర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్‌తో కలిసి స్పీకర్‌ రబీంద్రనాథ్‌ మహతో పక్షపాతంగా వ్యవహరిస్తూ తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (ప్రజాతంత్రిక్‌)’ను భాజపాలో విలీనం చేయడంతో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మరాండీకి ఫిరాయింపుల చట్టం వర్తింపజేయాలని 2020లో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.


దాతలూ.. ముందుకు రండి

ప్రపంచవ్యాప్తంగా 33.9 కోట్ల మంది వ్యాధులు, ఆహారలేమి, సంక్షోభం, పర్యావరణ సంబంధిత విపత్తుల భయంతో వణికిపోతున్నారు. వారికి అండగా నిలిచేందుకుగాను ఆరోగ్య అత్యవసర విజ్ఞప్తి కింద 254 కోట్ల డాలర్ల నిధులను సమీకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తలపెట్టింది. ఇందుకు దాతలు సహకరించాలని విన్నవిస్తున్నాం.

టెడ్రోస్‌ అధనోమ్‌


వివాదాస్పద వ్యాఖ్యలన్నీ న్యాయవ్యవస్థ బలోపేతానికేనా?

రిజిజూ నోటి నుంచి మరో ఆణిముత్యం వెలువడింది. న్యాయవ్యవస్థను తక్కువ చేసేలా మోదీ సర్కారు ఒక్క చర్య కూడా చేపట్టలేదని ఆయన అన్నారు. మరి ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలన్నీ న్యాయవ్యవస్థను బలోపేతం చేసేందుకేనా? వాటిని మీరు విశ్వసిస్తారేమో.. న్యాయవాదులమైన మేం మాత్రం నమ్మం.

కపిల్‌ సిబల్‌


కాంగ్రెస్‌ యోచన అదే

మెరుపుదాడులకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్‌ పదేపదే అడుగుతోంది. తద్వారా మన దేశ సాయుధ బలగాల సామర్థ్యాలపై విశ్వాసలేమిని బయటపెట్టుకుంటోంది. భారత్‌ను ముక్కలు చేయాలన్నదే కాంగ్రెస్‌ అసలైన యోచన.

ప్రకాశ్‌ జావడేకర్‌


మహాసముద్రాలే ఆధారం

భూమిపై కర్బన ఉద్గారాలను అత్యధికంగా శోషించుకునేవి మహాసముద్రాలే. భూమండలంపై 80% జీవులు ఆ జలాల్లోనే నివసిస్తున్నాయి. మన గ్రహంపై సగం ఆక్సిజన్‌ను మహాసముద్రాలే అందిస్తున్నాయి. వాటి ఆరోగ్యం దెబ్బతింటే.. ఆ ప్రతికూల ప్రభావం మానవాళి మొత్తంపై పడుతుంది.   

ఐరాస జీవ వైవిధ్య సంస్థ


 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని