లాయర్ల సమ్మెల నివారణపై ఇంకెంతకాలం చర్చిస్తారు?
రాష్ట్రాల్లో న్యాయవాదులు సమ్మెలకు దిగడాన్ని నివారించే పక్కా ప్రణాళికను రూపొందించడంలో భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది.
బీసీఐ జాప్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దిల్లీ: రాష్ట్రాల్లో న్యాయవాదులు సమ్మెలకు దిగడాన్ని నివారించే పక్కా ప్రణాళికను రూపొందించడంలో భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. లాయర్ల వృత్తిపరమైన మర్యాదలపై నియమాలను బలోపేతం చేయాలని సూచించింది. న్యాయవాదులు సమ్మెలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అతిక్రమణకు గురవుతున్నాయని కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘‘లాయర్ల సమ్మెల్ని నివారించేలా ఏం చర్యలు చేపట్టాలో చెప్పడానికి ఇంకెంతకాలం చర్చలు జరుపుతారు? బార్ కౌన్సిలే ఈ పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ ప్రక్రియను మీరెప్పుడో తాపీగా చేస్తామంటే మేం అనుమతించబోం’’ అని స్పష్టంచేసింది. పక్కా కార్యాచరణతో రావాలని సూచిస్తూ విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.
సుప్రీంలో విచారణకు రాని బిల్కిస్ బానో పిటిషన్
దిల్లీ: గోద్రా అల్లర్ల సమయంలో (2002) గర్భిణిగా ఉన్న తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ముందు బిల్కిస్ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. ఈ న్యాయమూర్తులు ఇద్దరూ అనాయాస మరణానికి సంబంధించిన మరో పిటిషను విచారిస్తున్న అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నందున వీలుపడలేదు. కాబట్టి బిల్కిస్ పిటిషను విచారణకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా మరో తేదీ కేటాయించనున్నారు.
జన్యుమార్పిడి ఆవాల ముప్పుపైనే మా ఆందోళన
జన్యుమార్పిడి (జీఎం) ఆవాల విషయంలో ఇతర అంశాల కంటే వాటివల్ల ఎదురయ్యే ముప్పుపైనే ప్రధానంగా తమకు ఆందోళన ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వీటికి పర్యావరణ అనుమతుల్ని కొన్ని షరతులకు లోబడి కేంద్రం ఇవ్వడంపై జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. డీఎంహెచ్-11 రకం జీఎం ఆవాలను ఉపయోగించి కొత్త వంగడాలను అభివృద్ధిపరచడానికి గత ఏడాది అక్టోబరు 25న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ‘జన్యు ఇంజినీరింగ్ మదింపు సంఘం’ (జీఈఏసీ) అనుమతించింది. ఇలాంటివాటిని పర్యావరణంలోకి విడుదల చేయడం వల్ల తలెత్తే పరిణామాలపై స్వతంత్ర సంస్థలు అన్నికోణాల్లో పరిశీలించి నివేదికలు ఇచ్చేవరకు జీఎం పంటలపై మారటోరియం విధించాలని సుప్రీంకోర్టును కోరుతూ ఉద్యమకర్త అరుణా రోడ్రిగ్స్, ‘జీన్ క్యాంపైన్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ధర్మాసనం పరిశీలించింది. అన్ని అంశాలనూ సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు.
జీవన సంకల్పం ప్రక్రియలో మేజిస్ట్రేట్ అనుమతి నిబంధన తొలగింపు
సుదీర్ఘ కాలంగా వైద్య చికిత్స పొందుతూ కోలుకుంటారనే ఆశ కోల్పోయిన వ్యక్తులకు అనాయాస మరణాన్ని ప్రసాదించడంలో కీలకమైన ‘జీవన సంకల్పం’ అమలులో సంక్లిష్టమైన నిబంధనను సుప్రీంకోర్టు తొలగించింది. అటువంటి వ్యక్తులకు ప్రాణాధార వ్యవస్థల నిలిపివేతకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను రద్దు చేసింది. అనాయాస మరణంపై సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులో గౌరవప్రదంగా మరణించడాన్ని కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇందుకు కొన్ని నిబంధనలను నిర్దేశించింది. చికిత్సకు లొంగని వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు... తమకు వైద్యాన్ని ఎప్పుడు నిలిపివేయాలనే విషయమై ముందస్తుగా రాసుకొన్న ‘జీవన సంకల్పం’(లివింగ్ విల్) నమోదుకు ఆ నిబంధనలు అవరోధంగా మారడంతో పునఃపరిశీలించాలన్న అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ‘జీవన సంకల్పం’ పత్రంపై సంబంధిత వ్యక్తి...ఇద్దరు సాక్షుల సమక్షంలో స్వచ్ఛందంగా సంతకం చేయాలని, దానిపై నోటరీ లేదా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని ధర్మాసనం మంగళవారం పేర్కొంది. 2018లో పేర్కొన్న...జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఇద్దరు సాక్షుల సంతకాల ప్రక్రియ స్థానంలో తాజా నిబంధనను చేర్చింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Syria Earthquake: ధ్వంసమైన జైలు.. ఐఎస్ ఉగ్రవాదులు పరార్..!
-
Politics News
Rahul Gandhi: వారి కోసం రూల్సే మార్చేశారు.. కేంద్రంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Eamcet exam: తెలంగాణలో మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష
-
Crime News
Uttar Pradesh: యూపీలో ఘోరం.. మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
-
India News
JEE Main 2023: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల జయభేరి!