సర్వోదయ సమాజ సాధనే లక్ష్యం
‘‘భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బి.ఎన్.రావు వంటి మేధావులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు చూపిన బాటలో ముందడుగు వేయడమే మన బాధ్యత అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.
అది మనందరి బాధ్యత
గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఈనాడు, దిల్లీ: ‘‘భారత రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బి.ఎన్.రావు వంటి మేధావులకు మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. వారు చూపిన బాటలో ముందడుగు వేయడమే మన బాధ్యత. అందరి అభ్యున్నతి కోరిన మహాత్ముడి ఆదర్శం సర్వోదయ సమాజ సాధనే లక్ష్యం కావాలి. దేశంలో ఎంతో భిన్నత్వం ఉన్నా మనం ఒకటిగా నిలిచామంటే అది కాలపరీక్షలో నిలబడిన మన రాజ్యాంగం గొప్పదనమే’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘ఆర్థికరంగంలో మనం సాధించిన పురోగతి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. గతేడాది భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఆర్థిక అనిశ్చితులు ఏర్పడినప్పుడు భారత్ ఈ ఘనత సాధించడం గమనార్హం’’ అని చెప్పారు.
కొవిడ్‌ను గట్టిగా ఎదుర్కొన్నాం
‘‘కొవిడ్ మహమ్మారి నాలుగో ఏట ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవృద్ధిని ఇది ప్రభావితం చేసింది. తొలినాళ్లలో భారత ఆర్థికవ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసినా.. సమర్థవంతమైన నాయకత్వంతో దాన్ని గట్టిగా ఎదుర్కొని, త్వరగానే ఈ అగాధం నుంచి బయటపడి మనం పురోగమనం మొదలుపెట్టగలిగాం. ఇపుడు వైరస్‌లకు భయపడాల్సిన అవసరం లేదు. మన నాయకత్వం, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, అధికారులు, కరోనా యోధులు కలిసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితిని కల్పించగలిగారు’’ అని రాష్ట్రపతి అభినందించారు.
ఉచిత రేషన్ చారిత్రక నిర్ణయం
‘‘ప్రభుత్వం మొదలుపెట్టిన ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2020 మార్చిలో ప్రవేశపెట్టిన గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా ప్రభుత్వం పేదలకు కష్టకాలంలో ఆహార భద్రతను కల్పించింది. ఈ సహాయాన్ని మరింత విస్తరిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా 81 కోట్ల లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదో చారిత్రక నిర్ణయం. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నూతన విద్యావిధానాన్ని తెచ్చుకున్నాం. డిజిటల్ ఇండియా మిషన్ గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించగలుగుతోంది. అంతరిక్ష రంగంలో ఎన్నాళ్లనుంచో పెండింగులో ఉన్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ఇందులోకి ఆహ్వానించాం. ఇండియా మార్స్ మిషన్‌కు మహిళలు నేతృత్వం వహిస్తూ మన ఆడపడుచులు ఎవరికీ తక్కువకాదని నిరూపిస్తున్నారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం ఇక ఎంతమాత్రం నినాదాలకే పరిమితం కాదు. ప్రజా భాగస్వామ్యంతో బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమం విస్తరించింది. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వివిధ విద్యాసంస్థలను సందర్శించినప్పుడు యువ మహిళలు కనబరిచిన ఆత్మవిశ్వాసం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత కోసమూ ప్రభుత్వం కృషి చేస్తోంది.’’
జీ-20 నాయకత్వం గొప్ప అవకాశం..
‘‘విభిన్న ప్రపంచ వేదికలపై మనం తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది భారత్ జీ-20 కూటమికి నాయకత్వం వహిస్తోంది. భూతాపం పెరగటం, వాతావరణంలో తీవ్ర మార్పుల వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి భారత్ నాయకత్వం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఐక్యరాజ్య సమితి భారత్ సూచనలను అంగీకరించి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఎక్కువమంది వీటిని స్వీకరించడం మొదలుపెడితే పర్యావరణంతోపాటు ఆరోగ్యానికీ మంచిదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
కోటి మంది మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ.. సాధినేని యామిని శర్మ
-
India News
India Summons UK Official: లండన్‌లో ఖలిస్థాన్ అనుకూలవాదుల దుశ్చర్య.. బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
-
India News
ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు.. దేశంలో మళ్లీ పెరుగుదల
-
World News
28 ఏళ్లకే 9 మందికి జన్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
-
Ts-top-news News
వరి పొలంలో భారీ మొసలి
-
Movies News
రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి