భారత్‌, ఈజిప్ట్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్‌, ఈజిప్ట్‌ల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా తీసుకువెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

Updated : 26 Jan 2023 06:02 IST

5 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు
అబ్దుల్‌ ఫతా అల్‌ - సీసీతో మోదీ చర్చలు

దిల్లీ: భారత్‌, ఈజిప్ట్‌ల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా తీసుకువెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల నడుమ సంబంధాలను విస్తరించడం సహా సీమాంతర ఉగ్రవాదం నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించాయి. వచ్చే అయిదేళ్లలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రూ.97,908 కోట్లకు (1,200 కోట్ల డాలర్లకు) పెంచుకునేందుకు ఉభయులూ ఓ అంగీకారానికి వచ్చారు. గురువారం జరిగే భారత గణతంత్ర దిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విచ్చేసిన ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ - సీసీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వ్యవసాయం, వాణిజ్యం సహా అనేక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఈజిప్టు అధ్యక్షుడితో మోదీ విస్తృత చర్చలు జరిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అబ్దుల్‌ ఫతా అల్‌ - సీసీ.. ప్రధాని మోదీతో జరిపిన సమావేశంలో ఈ మేరకు అవగాహనకు వచ్చారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆహారం, ఇంధనం, రసాయన ఎరువుల లభ్యతపై రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం గురించి కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారత్‌ నుంచి తేజస్‌ తేలికపాటి యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్ల సేకరణపై తన ఆసక్తిని ఈజిప్టు పునరుద్ఘాటించింది.

* ‘‘మానవ సమాజానికి ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం అనే విషయంలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం అంతానికి నిర్దిష్ట చర్యలు అవసరమని ఓ అంగీకారానికి వచ్చాం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ ప్రకటనలో తెలిపారు. సాంస్కృతిక సంబంధాలతోపాటు యూత్‌ ఎక్స్ఛేంజ్‌ తదితర అంశాలపైనా ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. భారత్‌, ఈజిప్ట్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలను స్మరించుకొంటూ పోస్టల్‌ స్టాంపుల మార్పిడి చేసుకున్నారు. ఐటీ, సైబర్‌ సెక్యూరిటీ, ప్రసార రంగాల్లో సహకారాన్ని అందించే దిశగా ఇరు దేశాల మధ్య అయిదు ఒప్పందాలు జరిగాయి. అగ్ర నేతల సమక్షంలో భారత సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌, ఈజిప్టు విదేశాంగ మంత్రి సమే హసన్‌ షౌక్రీ ఎంవోయూలపై సంతకాలు చేశారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన అబ్దుల్‌ ఫతా అల్‌ - సీసీకి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని