నవ భారత నిర్మాణ బాధ్యత యువతదే: మోదీ

దేశ అభివృద్ధి ఫలాలను అందుకొనేవారిలో యువతే అత్యధిక సంఖ్యలో ఉంటారని, ఆ దిశగా నవ భారత్‌ను నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత కూడా వారిపైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Updated : 26 Jan 2023 05:57 IST

దిల్లీ: దేశ అభివృద్ధి ఫలాలను అందుకొనేవారిలో యువతే అత్యధిక సంఖ్యలో ఉంటారని, ఆ దిశగా నవ భారత్‌ను నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత కూడా వారిపైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు వారు ప్రతీకలని అభివర్ణించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో బుధవారం దిల్లీలో ఆయన ఈ మేరకు ముచ్చటించారు. ఎన్నో రంగాల్లో ప్రపంచ భవిష్యత్తు కోసం భారత్‌ కృషిచేస్తోందని, యువత ముంగిట అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్‌ సాధిస్తున్న ఘనతల్లో ప్రపంచం కొత్త భవిష్యత్తును చూసుకుంటోందని వ్యాఖ్యానించారు. జైహింద్‌ అనే మంత్రం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. యువతరాన్ని జాతీయ లక్ష్యాలు, ఆకాంక్షలతో అనుసంధానం చేయడంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. వాటికి ప్రోత్సాహం అందించి, కార్యకలాపాలను విస్తరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సరిహద్దులు, తీరప్రాంతాల్లో విభిన్న సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయని, అవసరమైతే యువత తొలి వరుసలో ఉంటూ వీటిని సమర్థంగా ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జీ-20 సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించనుండటంపై విద్యార్థులు చర్చించుకోవాలన్నారు. ‘‘వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో అనుసంధానించినప్పుడే విజయావకాశాలు విస్తృతమవుతాయి. మీ విజయాలనే భారత్‌ విజయంగా ప్రపంచం చూస్తుంది. అందుకు అబ్దుల్‌ కలాం, హోమీ బాబా, సీవీ రామన్‌, ధ్యాన్‌చంద్‌ లాంటి వారే ఉదాహరణ. యువత కనిపించని అవకాశాలను వెలికితీయాలి. ఊహించని పరిష్కారాలను అన్వేషించాలి. యువతే నవభారత నిర్మాతలు’’ అని మోదీ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని